Share News

సదాశివపేట బల్దియాలో అవిశ్వాసం?

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:04 AM

పావులు కదుపుతున్న బీఆర్‌ఎస్‌ చీలికవర్గం మద్దతిస్తున్న ఓ కౌన్సిలర్‌ భర్త

సదాశివపేట బల్దియాలో అవిశ్వాసం?
సదాశివపేట మున్సిపల్‌ కార్యాలయం

సదాశివపేట, జనవరి 16: సంగారెడ్డి జిల్లా సదాశివపేట బల్దియా చైర్‌పర్సన్‌పై బీఆర్‌ఎస్‌ అసంతృప్తి కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బీఆర్‌ఎస్‌ పాలకవర్గాన్ని గద్దె దింపే ఆలోచనలో కాంగ్రెస్‌ నాయకులు సైతం తెర వెనుక అండగా నిలుస్తున్నారని ప్రచారం. నేడో, రేపో కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసులు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు నిర్ణయించుకున్నట్టు చర్చ సాగుతున్నది. కౌన్సిలర్‌గా కొనసాగుతున్న చైర్‌పర్సన్‌ కుమారుడి తీరుపై విసుగెత్తి ఎట్టిపరిస్థితుల్లో అవిశ్వాసం పెట్టి తీరాలని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు భావిస్తున్నారు. వారికి చైర్‌పర్సన్‌ పదవిపై ఆశతో ఇటీవల బీజేపీ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిన ఓ కౌన్సిలర్‌ భర్త మద్దతు తెలుపుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ‘బల్దియా’పై కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో అధికారపార్టీ ముందుకు వెళ్తున్నది. ఇటీవల బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న ఓ కౌన్సిలర్‌ భర్త తన భార్యను బల్దియా పీఠంపై కూర్చోబెట్టాలనే కృతనిశ్చయంతో అసంతృప్త కౌన్సిలర్లతో పలుమార్లు మంతనాలు జరిపి నయానో భయానో తనవైపు తిప్పుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆర్థికంగా చక్కదిద్దుకోవాలనుకుంటున్న కొందరు కౌన్సిలర్లు కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

Updated Date - Jan 17 , 2024 | 12:04 AM