Share News

అమ్మో ఇంత పిరమా?

ABN , Publish Date - May 15 , 2024 | 11:39 PM

చుక్కల్లో మిర్చి, అల్లం, వెల్లుల్లి ధరలు

అమ్మో ఇంత పిరమా?

మామిడి పచ్చళ్ల తయారీపై ప్రభావం

నారాయణఖేడ్‌, మే 15 : మామిడి కాత చేతికి అందడానికి తోడు వేసవి సెలవులు కావడంతో జనాలు పచ్చళ్లు చేసుకోవడంపై దృష్టి సారిస్తారు. మిర్చి, అల్లం, వెల్లుల్లి వంట నూనె ధరలు చుక్కలనంటుతుండంతో పచ్చడి చేసుకోవడానికి సాధారణ జనాలు జంకుతున్నారు. మామిడికాయ పచ్చడి చేసుకోవడానికి ప్రధానంగా అల్లం, వెల్లుల్లి, మిర్చి పొడి అవసరం. గత సంవత్సరం అల్లం, వెల్లుల్లి ధరలు కిలో రూ.100 నుంచి 120 వరకు ఉండగా, ప్రస్తుతం వెల్లుల్లి కిలో రూ.240, అల్లం నాణ్యమైనది రూ.140 చొప్పున విక్రయిస్తున్నారు. పచ్చళ్లకు వినియోగించే కారం పొడి కిలో రూ.600 వరకు ఉంది. నువ్వులు, ఆవాల ధరలు కూడా గతంలో కంటే పెరిగాయి. ఈ సంవత్సరం మామిడికాత ఆశాజనకంగా కాసినప్పటికీ, ఎండల తీవ్రత వల్ల మామిడి కాయలు దెబ్బతినడంతో నాణ్యమైన కాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మార్కెట్లో మామిడి పచ్చడి కాయలు సైజును బట్టి రూ.8 నుంచి 10 వరకు విక్రయిస్తున్నారు. వాటిని ముక్కలుగా చేసుకోవడానికి ఒక్కో కాయకు రూ.4 చొప్పున తీసుకుంటున్నారు. గుజ్జు కాయలు కిలో రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. ఎండాకాలంలో మామిడి కాయలతో పచ్చళ్లు చేసుకొని ఏడాది పాటు తినడానికి జనాలు ఆసక్తి చూపుతారు. ఈ సంవత్సరం పచ్చళ్లు తయారు చేసుకోవడానికి అవసరమైన అన్ని సరుకుల ధరలు చుక్కలనంటడంతో వాటి తయారీకి భయపడుతున్నారు.

Updated Date - May 15 , 2024 | 11:39 PM