గజ్వేల్‌లో నిలిచిపోయిన యూజీడీ పనులు
ABN , Publish Date - May 17 , 2024 | 11:49 PM
బిల్లులు రాకపోవడంతో ఆపేసిన కాంట్రాక్టర్
గజ్వేల్, మే 17: సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీని మురుగు రహిత మునిసిపాలిటీగా మార్చేందుకు గత ప్రభుత్వం తలపెట్టిన అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనుల కాంట్రాక్టర్ పనులను అర్ధాంతరంగా నిలిపివేశాడు. మునిపిసాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలపడంలో భాగంగా చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం, గత ప్రభుత్వ పట్టింపులేని తనంతో మధ్యలోనే ఆగిపోయింది. 2021 చివరి నాటికి పూర్తి కావాల్సిన పనులు 2024 వచ్చినా పూర్తికాకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 2018 ఆగస్టు 1న రూ.99కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. 100 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణం పూర్తికాగా, మరో 40 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. గతంలో విడుదల చేసిన రూ.99కోట్లు సరిపోకపోవడం, చేసిన పనులకు సంబంధించిన నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ చేసేదేమీ లేక మధ్యంతరాన పనులను వదిలేశాడు. ఇప్పటివరకు కాలనీల్లో పూర్తిస్థాయి కనెక్షన్లు ఇవ్వకపోవడం.. మరో నెల రోజుల్లో వర్షాకాలం ముంచుకువచ్చే అవకాశాలు ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది లక్ష్మిప్రసన్ననగర్, సిరి ఎన్‌క్లేవ్ కాలనీలో వర్షం దాటికి మురుగు నీరు ఛంబర్ల నుంచి బయటకు వచ్చింది. దీంతో రోడ్లన్నీ దుర్గంధంతో నిండిపోయాయి. మరోసారి వర్షాలు కురిస్తే ఇదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలున్నాయి. మునిసిపాలిటిలో వంద కిలోమీటర్ల మేర యూజీడీ నిర్మాణం చేపట్టగా వంద కిలోమీటర్లలో 9వేల ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 8,700 కనెక్షన్లు మాత్రమే ఇచ్చారు. మిగిలిన కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ప్రజలు కనెక్షన్లు ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై స్థానిక కౌన్సిలర్లు, మునిసిపల్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోవడంతో వారు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపల్ పరిధిలోని విలీన గ్రామాలైన క్యాసారం, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ గ్రామాల్లో యూజీడీ అంశంపై మునిసిపల్ పాలకవర్గం రూ.40కోట్ల నిధులు కావాలని మునిసిపాలిటీలో తీర్మానం చేసి గత ప్రభుత్వానికి అంచనాను పంపించారు. ఈ క్రమంలో ఎన్నికలు రావడంతో తీర్మానాన్ని పట్టించుకోలేదు. దీంతో విలీన గ్రామాల్లో యూజీడీ నిర్మాణంపై నీలినీడలు అలుముకున్నాయి. ఇటు కాంట్రాక్టర్‌కు రావాల్సిన బిల్లులకు సంబంఽధించి ఎలాంటి స్పందన లేకపోవడంతో యూజీడీ నిర్మాణం, కొనసాగింపుపై గ్రహణం పట్టుకుందని చెప్పవచ్చు.