Share News

సాగుకు సమాయత్తం

ABN , Publish Date - May 15 , 2024 | 11:41 PM

వానాకాలం పంటల ప్రణాళిక ఖరారు

సాగుకు సమాయత్తం

అంచనాలను సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ

సంగారెడ్డి జిల్లాలో 7.24 లక్షల ఎకరాల్లో సాగు

మెదక్‌ జిల్లాలో 3.73 లక్షల ఎకరాలు

విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు

మెదక్‌/సంగారెడ్డి టౌన్‌, మే 15 : వానాకాలం (ఖరీఫ్‌ ) సీజన్‌ పంటల సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. ఏ పంట ఎంత మేరకు సాగు కానున్నది. ఇందుకు అనుగుణంగా ఏ రకం విత్తనాలు ఎంత మేరకు అవసరం అవుతాయని అంచనాలను రూపొందించారు. గత సీజన్‌ కంటే ఈసారి వరి, పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశమున్నట్లు అంచనా వేశారు.

తొలకరి వర్షాలపై ఆశలు

సింగూరు, నల్లవాగు, నారింజ, ఘనపురం సాగునీటి ప్రాజెక్ట్‌లతో పాటు చెరువులు, కుంటలు, బోరుబావులపై ఆధారపడి రైతులుపంటలు వేస్తుంటారు. ఏటా వానాకాలంలో ప్రధానంగా పత్తి, వరి పంటలను సాగు చేస్తున్నారు. వీటితో పాటు కంది, పెసర, మినుము, సోయాబీన్‌ తదితర పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ఈసారి తొలకరిలోనే వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో అన్నదాతలు వానాకాలం సీజన్‌పై ఆశలు పెంచుకున్నారు.

గతేడాదికి మించి..

గతేడాది సంగారెడ్డి జిల్లాలో అన్ని పంటలు కలిపి 7,17,529 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేయగా 7,11,548 ఎకరాలు సాగైంది. ఇందులో పత్తి 3,50,936 ఎకరాలకు గాను 3,48,946 ఎకరాల్లో సాగు చేశారు. వరి 1,38,380 ఎకరాల అంచనాకు 1,34,934 ఎకరాల్లోనే సాగైం ది. మెదక్‌ జిల్లాలో గత సీజన్‌లో 3,00,967 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, 37,321 ఎకరాల్లో పత్తి పంట వేశారు. ఈసారి అంతకు మించి సాగయ్యే అవకాశమున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది.

సాగు ఇలా..

ఈసారి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 7,24,405 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా పత్తి 3.60 లక్షల ఎకరాల్లో, వరి 1.50 లక్షల ఎకరాల్లో సాగు చేయొచ్చని ప్రణాళికలు సిద్ధం చేశారు. మొక్కజొన్న 14,200, సోయాబీన్‌ 77,600, కంది 79,500, మినుములు 6,300, పెసర్లు 9,800, చెరకు 25,000 ఎకరాల్లో సాగు చేసే అవకాశాలున్నాయని ఆ శాఖ అంచనా వేసింది. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 3,73,509 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. అందులో వరి పంట 3,27,113 ఎకరాల్లో సాగు చేయొచ్చని, పత్తి 40,619 ఎకరాల్లో సాగవుతుందని ప్రణాళిక రూపొందించారు. మొక్కజొన్న 2,820, 1,125 కందులు, మినుములు 383, చెరకు 109, పెసర 1027 ఎకరాల్లో, మిగతా ఉద్యానవన పంటలు పండించే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అంచాన వేసింది.

విత్తనాలు, ఎరువులపై దృష్టి

సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మెదక్‌ జిల్లాలో 79,785 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేశారు. వరి 78,500 క్వింటాళ్లు, పత్తి విత్తనాలు 238 క్వింటాళ్లు, కంది 123, మొక్కజొన్న 720, జొన్న 6, మినుప 53, పెసర విత్తనాలు 145 క్వింటాళ్లు అందుబాటులో ఉంచనున్నారు. సంగారెడ్డి జిల్లాలో వరి విత్తనాలు 33,956 క్వింటాళ్లు, కంది 67,165, మొక్కజొన్న 10,985, సోయాబీన్‌ 59,095, పెసర్లు 7,020, మినుములు 4,455 క్వింటాళ్లు, 7 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచనున్నారు. అలాగే అవసరమైన ఎరువుల కోసం అధికారులు యాక్షన్‌ప్లాన్‌ రూపొందించారు.

Updated Date - May 15 , 2024 | 11:41 PM