Share News

ముగ్గురు.. ముగ్గురే..

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:59 PM

ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో మెదక్‌ పార్లమెంటు ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.

ముగ్గురు.. ముగ్గురే..

మెదక్‌ పార్లమెంటులో పోరు ఆసక్తికరం

ఖరారైన ప్రధాన పార్టీల అభ్యర్థులు

ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

నీలం మధుకే కాంగ్రెస్‌ టికెట్‌

ప్రచారమే లక్ష్యంగా ఎవరి వ్యూహాలు వారివే

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మార్చి28 : ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో మెదక్‌ పార్లమెంటు ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ కలెక్టర్‌, ఎమ్మెల్సీ వెంకట్రామారెడ్డి పేర్లు ఖరారయ్యాయి. తాజాగా నీలం మధుకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ప్రకటించింది. దీంతో ప్రచారమే లక్ష్యంగా ఎవరి వ్యూహాల్లో వారు నిమగ్నమయ్యారు. రఘునందన్‌రావు, వెంకట్రామారెడ్డి సన్నాహక సమావేశాలు, కార్యకర్తల సభలు, విభిన్నవర్గాలతో ముఖాముఖి కార్యక్రమాలు చేపడుతున్నారు. నీలం మధు సైతం గురువారం రంగంలోకి దిగారు. పలువురు కాంగ్రెస్‌ నేతలను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

ఇందిర నియోజకవర్గం

తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో మెదక్‌ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఇదే లోక్‌సభ నుంచి 1980లో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ పోటీచేసి గెలుపొందారు. దీంతో మెదక్‌ పేరు ఆనాడు దేశంలోనే మార్మోగింది. ఇందిరా నియోజకవర్గంగా గుర్తింపు దక్కింది. ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు వరుసగా ప్రాతినిథ్యం వహించారు. ఇక 2004 నుంచి 2019 పార్లమెంటు ఎన్నికల వరకు బీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. పదేళ్ల ఉద్యమం, మరో పదేళ్ల అధికార పర్వంలో ఈ స్థానాన్ని బీఆర్‌ఎస్‌ నిలబెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కేంద్రంలో బీజేపీ ధీమాగా ఉండడంతో ఇక్కడి పోటీ రసవత్తరంగా మారనున్నది.

రెండోసారి రఘునందన్‌ పోటీ

మెదక్‌ బీజేపీ అభ్యర్థిగా మాధవనేని రఘునందన్‌రావు రెండోసారి బరిలోకి దిగుతున్నారు. 2019 ఎన్నికల్లో పోటీచేసిన ఆయనకు 2,01,567 ఓట్లు పోలయ్యాయి. ఆనాడు మూడోస్థానంలో నిలిచారు. తర్వాత జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో మళ్లీ ఓటమి ఎదురైంది. ఈ క్రమంలో మెదక్‌ పార్లమెంటు అభ్యర్థిగా మరోసారి అవకాశం ఇప్పించాలని అధిష్ఠానాన్ని కోరారు. స్థానిక సమీకరణాల దృష్ట్యా రఘునందన్‌ వైపే పార్టీ మొగ్గు చూపింది. తన అభ్యర్థిత్వం ఖరారైన మరుక్షణం నుంచే తన వ్యూహాలకు పదును పెట్టారు. బూత్‌ కమి టీల వారీగా సమావేశాలు నిర్వహించారు. విభిన్న వర్గాలతోనూ ముఖాముఖి చర్చలు జరిపారు. గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మెదక్‌లో రెండోసారి పోటీ చేయడం రఘునందన్‌కు అనుభవపరంగా కలిసొచ్చే అంశం. ఓడిన సానుభూతి, బీజేపీ ఓటు బ్యాంకు, మోదీ చరిష్మాతోపాటు ఇతరాత్ర అంశాలు తన విజయానికి దోహదం చేస్తాయని ఆశిస్తున్నారు.

వార్డు మెంబర్‌ టు ఎంపీ అభ్యర్థిగా..

పటాన్‌చెరు మండలం చిట్కూల్‌ గ్రామంలో వార్డు సభ్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నీలం మధును కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ అభ్యర్థిగా బరిలో నిలిపింది. 2006లో వార్డు సభ్యుడిగా, 2014లో ఉప సర్పంచ్‌గా, 2019లో చిట్కుల్‌ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2014లో బీఆర్‌ఎస్‌ నుంచి పటాన్‌చెరు జడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. 2023లో పటాన్‌చెరు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన మధుకు భంగపాటు ఎదురవ్వడం తో కాంగ్రె్‌సలో చేరారు. కాంగ్రె్‌సలోనూ టికెట్‌ దక్కకపోవడంతో ఆ వెంటనే బీఎస్పీలో చేరి ఎమ్మెల్యేగా పోటీచేసి పరాజయం చవిచూశారు. తాజాగా మళ్లీ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న మధుకు కీలకమైన పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ముదిరాజ్‌ సామాజికవర్గంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ఓటుబ్యాంకు, ఆ పార్టీ సంక్షేమ పథకాల లబ్ధిదారుల మద్దతు దక్కుతుందనే ధీమాతో ఉన్నారు.

వ్యూహాత్మకంగానే వెంకట్రామారెడ్డి

మెదక్‌ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. నెల క్రితమే మాజీ కలెక్టర్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వెంకట్రామారెడ్డి పేరును ఆ పార్టీ తెరమీదకు తెచ్చింది. ఆయనకే టికెట్‌ ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వా త వెంకట్రామారెడ్డి పేరు కనుమరుగై మరికొందరి పేర్లు చర్చకొచ్చాయి. అయితే ఈ పేర్లన్నింటిపై కార్యకర్తలు, ముఖ్యనేతలతోపాటు ప్రజల్లోనూ అభిప్రాయ సేకరణ చేసినట్లు తెలిసింది. దీంతో వెంకట్రామారెడ్డి వైపే మొగ్గు కనిపించడంతో మళ్లీ ఆయనను ఫైనల్‌ చేశారు. సిద్దిపేట కలెక్టర్‌గా, ఉమ్మడి మెదక్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, డ్వామా పీడీగా సుదీర్ఘకాలం పనిచేసిన వెంకట్రామారెడ్డి పరిచయం అక్కర్లేని వ్యక్తి కావడంతో ఆయన్నే బరిలో దింపారు. దీనికితోడు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలుంటే ఆరింట్లోనూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉండడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. అదే విధంగా మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు.

ముగ్గురికీ పటాన్‌చెరు నేపథ్యం..

మెదక్‌ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇందులో పటాన్‌చెరు సైతం ఒకటి. కాగా ప్రస్తుతం ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్థులకూ పటాన్‌చెరు నియోజకవర్గ నేపథ్యం ఉండడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇదే పటాన్‌చెరులో జర్నలిస్టుగా, న్యాయవాదిగా పనిచేయడంతోపాటు జడ్పీటీసీగా పోటీ చేశారు. తన రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుండే ప్రారంభమైంది. తర్వాత తన స్వస్థలమైన దుబ్బాక వేదికగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ఇదే పటాన్‌చెరు మండలం చిట్కుల్‌ గ్రామ సర్పంచ్‌గా ఇటీవలి వరకు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగానూ పటాన్‌చెరులో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డి సైతం పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్సీపురం మండలం తెల్లాపూర్‌లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తన కుటుంబానికి సంబంధించిన ఓట్లన్నీ ఇదే నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ముగ్గురికి కూడా పటాన్‌చెరు ప్రాంతంతో సంబంధాలు నెలకొన్నాయి. అంతేగాకుండా జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉన్న గాలి అనిల్‌కుమార్‌ కూడా పటాన్‌చెరు నివాసి కావడం గమనార్హం.

Updated Date - Mar 28 , 2024 | 11:59 PM