Share News

సిద్దిపేట జిల్లాలో దొంగల బీభత్సం

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:09 AM

తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్‌ వరుస చోరీలకు పాల్పడుతున్న దుండగులు ఫిబ్రవరిలో ఇప్పటి వరకు 16 దొంగతనాలు విఫలమైన పోలీస్‌ నిఘా వ్యవస్థ

సిద్దిపేట జిల్లాలో దొంగల బీభత్సం
గౌరాయపల్లి గ్రామంలో చోరీకి పాల్పడిన దుండగులు ఓ ఇంట్లోని వస్తువులను చిందరవందర చేసిన దృశ్యం (ఫైల్‌)

సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 25: జిల్లాలో తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌ చేసుకొని దుండగులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. వరుస చోరీలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో గత నెలలో 32 దొంగతనాలు, ఫిబ్రవరిలో 16 దొంగతనాలు జరిగాయి. వీటిలో 22 దొంగతనాల కేసులను చేదించినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఒకేరోజు ఆరు ఇళ్లలో చోరీ

15 రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని మాహాశక్తి నగర్‌కు చెందిన సుమన్‌ అనే ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్‌ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో సహా తమ బంధువుల ఊరికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న 35 తులాల బంగారు ఆభరణాలు చోరి అయ్యాయి. అదేవిధంగా కొమురవెల్లి మండలం గౌరాయపల్లి గ్రామంలో ఈ నెల 12న రాత్రి 6 ఇళ్ల తాళాలు పగులగొట్టి సుమారు రూ.3,40,000 నగదు, 12 తులాల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ సంఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆరు రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని రాఘవేంద్రనగర్‌లో తాళం వేసిన ఇంట్లో దుండగులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. నాలుగు రోజుల క్రితం చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో తాళం వేసిన రెండు ఇండ్లలో దొంగతనం జరిగింది. వారం రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కమాన్‌ వద్ద ఓ చికెన్‌ సెంటర్‌లో గుర్తు తెలియని వ్యక్తి యజమాని దృష్టి మరల్చి కౌంటర్‌లో ఉన్న రూ.మూడు లక్షలను ఎత్తుకెళ్లాడు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలపై అనుమానం

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది కూలీలే ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం జాతరలు, పెండ్లిలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్తున్నారు. అదునుగా భావించిన దుండగులు చోరీలకు పాల్పడుతన్నారు. పగటి పూట గ్రామాలు, పట్టణాల్లో తిరిగి తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్నటు సమాచారం. పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్‌ పక్కాగా చేయకపోవడం వల్లనే దొంగతనాలు జరుగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సిద్దిపేటకు రైలు సౌకర్యం ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి రైలు ద్వారా దొంగలు జిల్లాకు చేరుకొని దొంగతనాలకు పాల్పడి దోచుకున్న సొమ్ముతో అదే రైలు మార్గం ద్వారా పారిపోతున్నట్లు సమాచారం. రైల్వే స్టేషన్‌లోనూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పనిచేయని సీసీ కెమెరాలు

జిల్లాలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సుమారు 5 వేలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పట్టణాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కమిషనర్‌ కార్యాలయంలో ఉన్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. గ్రామాల్లో ఉన్న సీసీ కెమెరాలు గ్రామపంచాయతీలోని కంప్యూటర్‌కు అటాచ్‌ చేశారు. కానీ వాటి నిర్వహణను పోలీసులు పట్టించుకోవడం లేదు. దొంగతనం జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే పనిచేయడం లేదు. సీసీ కెమెరాలకు మరమ్మతులు చేస్తే నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడం సులభమవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Feb 26 , 2024 | 12:09 AM