Share News

ఎంసీహెచ్‌, న్యూట్రిషన్‌ కిట్ల కథ కంచికే!

ABN , Publish Date - Mar 07 , 2024 | 11:54 PM

సంగారెడ్డి అర్బన్‌, మార్చి 7: మాతా శిశు సంరక్షణ కోసం అప్పటి సర్కారు ప్రవేశ పెట్టిన రెండు పథకాలు ఇక నిలిచిపోనున్నాయా? అంటే వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తున్నది.

ఎంసీహెచ్‌, న్యూట్రిషన్‌ కిట్ల కథ కంచికే!
ఎంసీహెచ్‌ కిట్‌

సంగారెడ్డి జిల్లాలో రెండు పథకాల కిట్లకు కటకట

ఎంసీహెచ్‌తో పాటు ప్రధాన ఆస్పత్రుల్లో కొరత

నెలరోజులుగా సరఫరా నిలిచిపోవడంతో అనుమానాలు

ఉన్నతాధికారుల నుంచి స్పందన కరువు

ఆ కిట్ల గురించి అడగొద్దంటూ మౌఖిక ఆదేశాలు?

సంగారెడ్డి అర్బన్‌, మార్చి 7: మాతా శిశు సంరక్షణ కోసం అప్పటి సర్కారు ప్రవేశ పెట్టిన రెండు పథకాలు ఇక నిలిచిపోనున్నాయా? అంటే వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తున్నది. 2017 జూన్‌ 4 నుంచి ఎంసీహెచ్‌ కిట్‌ పథకం ప్రవేశ పెట్టగా, 2023 జూన్‌ 14న న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని అమలు చేస్తున్నారు. సంగారెడ్డిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంతో పాటు జిల్లాలోని పీహెచ్‌సీలు, ప్రధాన ఆస్పత్రుల్లో నెలరోజులుగా ఎంసీహెచ్‌తో పాటు న్యూట్రిషన్‌ కిట్ల కొరత ఏర్పడింది. పై నుంచి సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో ఆ రెండు పథకాల కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నగదు లేదు.. కిట్లు లేవు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్న ఉద్దేశంతో ఎంసీహెచ్‌ కిట్‌ను అమలు చేయగా, గర్భిణుల్లో రక్తహీనత నివారణకు పౌష్టికాహారాన్ని అందించాలనే సంకల్పంతో న్యూటిషన్‌ కిట్‌ను అందించే కార్యక్రమాన్ని అప్పటి సర్కారు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఎంసీహెచ్‌ కిట్‌తో పాటు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేల ప్రోత్సాహక నగదును నాలుగు విడతల్లో ఖాతాలో జమ చేసేది. ఇప్పటికే ఆ పథకం కింద నగదు జమ మూడేళ్లుగా నిలిచిపోగా, సంగారెడ్డి జిల్లాలో రూ.35 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఎంసీహెచ్‌ కిట్‌తో పాటు న్యూట్రిషన్‌ కిట్ల సరఫరా, పంపిణీ నిలిచిపోవడంతో గర్భిణులు, బాలింతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. నగదుతో పాటు కిట్లు రాకపోవడంతో పేద కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. రెండు పథకాలు మంచి ఫలితాలనిస్తున్నా.. ప్రభుత్వం మారడంతో అటు కిట్లు, ఇటు నగదు రెండు నిలిచిపోయి గర్భిణులు, బాలింతలు నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో వేల మంది లబ్ధిదారులకు ఎదురుచూపులే దిక్కయ్యాయి.

ఆ పథకాలకు రాం..రాం?

ఎంసీహెచ్‌, న్యూట్రిషన్‌ కిట్‌ పథకాల అమలు కథ కంచికేనన్న చర్చ ఆరోగ్యశాఖ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. జిల్లాలో ఆ రెండు కిట్ల కొరత ఏర్పడడంతో జిల్లా వైద్య అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, సరఫరాపై వారి నుంచి స్పందన లేదని ఓ అధికారి తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ సర్కారు అమలుచేసిన పథకం కాబట్టి, కాంగ్రెస్‌ సర్కారు కొనసాగింపుపై అనుమానాలున్నాయని చెప్పినట్టు సమాచారం. ఆ కిట్ల గురించి అడగడం, మాట్లాడడం కానీ చేయకపోతే మంచిదన్న అభిప్రాయాన్ని జిల్లా వైద్యాధికారులకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది.

Updated Date - Mar 07 , 2024 | 11:54 PM