Share News

తండ్రిని హతమార్చిన కొడుకు

ABN , Publish Date - Mar 16 , 2024 | 11:33 PM

పాపన్నపేట, మార్చి 16: నిత్యం తాగొచ్చి తల్లిని వేధిస్తున్నాడని కన్న తండ్రిని కొడుకు హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం గ్రామంలో శనివారం చోటు చేసుకున్నది.

తండ్రిని హతమార్చిన కొడుకు

నిత్యం తాగొచ్చి తల్లిని వేధిస్తుండడంతో ఘాతుకం

వారంక్రితమే పోలీసులకు ఫిర్యాదు

కౌన్సెలింగ్‌ ఇప్పించినా మారని తీరు

వేధింపులు తాళలేక పథకం ప్రకారం ఉరేసి హత్య

పాపన్నపేట, మార్చి 16: నిత్యం తాగొచ్చి తల్లిని వేధిస్తున్నాడని కన్న తండ్రిని కొడుకు హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని రామతీర్థం గ్రామంలో శనివారం చోటు చేసుకున్నది. స్థానికులు, ఎస్‌ఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంగం ప్రేమానందం(45), సుగుణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. పెద్ద కుమారుడు సందీప్‌ సిద్దిపేటలో డిగ్రీ, కూతురు సంపూర్ణ ఓ రెసిడెన్షియల్‌ పాఠశాలలో 9వ తరగతి, చిన్న కొడుకు ఏడో తరగతి చదువుతున్నారు. కాగా మద్యానికి బానిసైన ప్రేమానందం తరచూ భార్యను అనుమానిస్తూ వేధించడమే కాకుండా తీవ్రంగా కొట్టేవాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్ది చెప్పినా తీరు మారలేదు. ఈ క్రమంలో గత బుధవారం మళ్లీ గొడవ జరగ్గా.. భార్య సుగుణమ్మ, పెద్ద కుమారుడు సందీప్‌ కలిసి ప్రేమానందంను రోకలి బండతో నడవరాకుండా కొట్టి.. సుగుణమ్మ తల్లిగారి ఊరైన అల్లాదుర్గం మండల పరిధి రెడ్డిపల్లి గ్రామానికి వెళ్లిపోయింది. శనివారం సందీప్‌ ఇంటికి వచ్చేసరికి తండ్రి ప్రేమానందం, తాత ప్రసాద్‌ మాట్లాడుకుంటున్నారు. అందరినీ బయటకు వెళ్లగొట్టిన సందీప్‌ లోపలి నుంచి తలుపులు పెట్టాడు. లేవలేని స్థితిలో ఉన్న తండ్రిని కరెంట్‌ హీటర్‌, ఇతర వస్తువులతో విచక్షణారహితంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక ప్రేమానందం అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు తీయమని చెప్పారు. వారి మాటను పట్టించుకోని సందీప్‌.. ‘కొన ఊపిరితో ఉన్నాడు. కొద్దిగా ఆగండి, ప్రాణం పోయాక తలుపులు తీస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత చున్నీతో ప్రేమానందంకు ఉరేసి చంపి బయటకు వచ్చాడు. వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారమందించారు. ఎస్‌ఐ నరేష్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఉన్నతాధికారులకు తెలిపారు. మెదక్‌ రూరల్‌ సీఐ కేశవులు, క్లూస్‌టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు కూడా నెల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు వివరించారు. కాగా వారంరోజుల క్రితమే మృతుడి వేధింపులు భరించలేక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి.. కౌన్సెలింగ్‌ ఇప్పించారు. అయినా అతనిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సందీప్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిసింది. సందీప్‌ ఇటీవల పోలీసు ఉద్యోగానికి సిద్ధం కాగా.. కాస్తలో ఉద్యోగం చేజారింది.

Updated Date - Mar 16 , 2024 | 11:33 PM