Share News

పంచాయతీల్లో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన!

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:23 AM

సర్పంచ్‌ల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన అమలులోకి రానున్నది.

పంచాయతీల్లో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన!

కసరత్తు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం

ఎంబీ రికార్డులు ఉంటేనే బిల్లుల చెల్లింపులు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జనవరి 27: సర్పంచ్‌ల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన అమలులోకి రానున్నది. పంచాయతీ ఎన్నికలు 2019 జనవరిలో జరిగిన విషయం తెలిసిందే. వీరి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తున్నప్పటికీ తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలుస్తున్నది. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్ల నియామకాలకు జిల్లా యంత్రాంగం కసరత్తు పూర్తిచేసింది. పంచాయతీలవారీగా స్పెషల్‌ ఆఫీసర్ల జాబితాను సిద్ధం చేసింది. ప్రభుత్వం అడిగిందే తడువుగా జాబితాను పంపించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.

ఆయా శాఖల ఉద్యోగులకు బాధ్యతలు

జిల్లాలో 647 గ్రామ పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్లుగా జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లను నియమిస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖలలో పనిచేస్తున్న వీరికి అవసరాలను బట్టి ఒక్కొక్కరికి ఒకటి లేదా రెండు గ్రామ పంచాయతీలను కేటాయించనున్నారు. వీరిపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలను పర్యవేక్షణ అధికారులుగా నియమించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.

ఎంబీ రికార్డులుంటేనే చెల్లింపులు

జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు తమ పదవీ కాలంలో చేపట్టిన బిల్లుల చెల్లింపులకు కచ్చితంగా ఎంబీ రికార్డులు ఉండాల్సిందేనని పంచాయతీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, ఉపాధి హామీ, ఎస్‌ఎ్‌ఫసీ, జనరల్‌ ఫండ్‌ ద్వారా నిధులు మంజూరయ్యాయి. వీటి ద్వారా గ్రామ పంచాయతీల్లో వివిధ పనులను చేపట్టడం జరిగింది. ఆయా పనుఓ్ల చాలావాటికి బిల్లులు చెల్లింపులు జరగలేదు. పదవీ కాలం ముగుస్తున్నా చేసిన బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయమై జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌ మోహన్‌ వద్ద ప్రస్తావించగా పంచాయతీలలో పూర్తిచేసిన పనులకు సంబంధించి ఈనెలాఖరులోగా ఎంబీరికార్డులు, గ్రామ పంచాయతీ తీర్మానాలు, స్టాక్‌ రిజిస్టర్‌ ఉంటే బిల్లులు చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.

Updated Date - Jan 28 , 2024 | 12:23 AM