హస్తం హవా
ABN , Publish Date - Jun 05 , 2024 | 12:13 AM
జహీరా‘బాద్‌షా’ సురేష్‌కుమార్‌షెట్కార్
బీజేపీలో చేరినా బీబీ పాటిల్‌కు తప్పని భంగపాటు
ఆంధ్యజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూన్ 4 : జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ బీబీపాటిల్‌పై 47,893 ఓట్ల మొజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 16,41,410 ఓట్లుండగా 12,25027 ఓట్లు పోలయ్యాయి. వీటిలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్‌కు 5,23,919 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 4,76,023 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ 1,17,412 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. పోటీచేసిన మిగిలిన అభ్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా పోయాయి. ఈ నియోజకవర్గంలో తొలుత కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎ్‌సల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ధీ బీఆర్‌ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ చేతులెత్తేశారు. దీంతో, బీఆర్‌ఎస్ శ్రేణులు బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్‌కు అనుకూలంగా పనిచేశారు. అయినా, పాటిల్ ఓటమిని తప్పించుకోలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీపాటిల్ గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదనే అంచనాతో బీజేపీలో చేరారు. కమలం పార్టీ టికెట్‌పై పోటీ చేసినా ఆయనకు భంగపాటు తప్పలేదు.
పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీకి మొగ్గు
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 11,650 పోస్టల్ బ్యాలెట్లను వినియోగించారు. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్‌కు 6,207, కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్‌షెట్కార్‌కు 4,499, బీఆర్‌ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు 666 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఈసారి అనూహ్యంగా 84 బ్యాలెట్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈసారి ఉద్యోగులతో పాటు వయోవృద్ధులకు కూడా పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారు. నోటాకు కూడా 44 పోస్టల్ బ్యాలెట్లు రావడం విశేషం.
2014లో ఓటమికి ప్రతీకారం
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 2009 పునర్విభజనలో ఏర్పడింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సురే్‌షకుమార్ షెట్కార్ 17,407 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో టీఆర్‌ఎస్ హవా కొనసాగి, ఆ పార్టీ నుంచి పోటీచేసిన బీబీపాటిల్ చేతిలో షెట్కార్ 1,44,631 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో సురే్‌షషెట్కార్ పోటీ చేయలేదు. ప్రస్తుత ఎన్నికల్లో పదేళ్ల కిందట తనను ఓడించిన బీబీపాటిల్‌ను 47,893 ఓట్ల తేడాతో ఓడించి షెట్కార్ ప్రతీకారం తీర్చుకున్నారు.
గీతం యూనివర్సిటీ ఆవరణలో కోలాహలం
సంగారెడ్డి టౌన్, జూన్ 4: జహీరాబాద్ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పటన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీ ఆవరణలో మంగళవారం ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులతో కోలాహలంగా మారింది. ఆయా పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం ఆరు గంటల వరకు కేంద్రానికి చేరుకోగా, ఫలితాలు తెలుసుకునేందుకు ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు భారీగా తరలిరావడంతో సందడిగా మారింది. గీతం యూనివర్సిటీ నుంచి రెండు కిలోమీటర్ల మేర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వాహనాలను కిలోమీటరు దూరంలోనే ఆపివేశారు. రౌండ్ల వారీగా ఫలితాలు కాంగ్రె్‌సకు అనుకూలంగా రావడంతో ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు పార్టీ నాయకులు నిరాశతో తిరిగి వెళ్లిపోయారు. ఉదయమే కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్.. 10 రౌండ్లలోనూ కాంగ్రెస్‌కు మెజార్టీ రావడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు నిరాశతో పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కాంగ్రె్‌సకు మెజార్టీ వస్తుండడంతో ఆ పార్టీ అభ్యర్థి సురేశ్ కుమార్ షెట్కార్‌తో పాటు డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కుమార్తె త్రిష కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. తుది ఫలితం తేలడంతో సాయంత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాలుస్తూ విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. కాగా కౌంటింగ్ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయా పార్టీల ఏజెంట్లు అసహనం వ్యక్తం చేశారు.