Share News

ప్రత్యేకాధికారులకు మొదటి టాస్క్‌

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:26 PM

మెదక్‌ అర్బన్‌, ఫిబ్రవరి 6: గ్రామపంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ఇటీవల ముగిసింది. ఈనెల 2 నుంచి స్పెషలాఫీసర్ల పాలన ప్రారంభమైంది.

ప్రత్యేకాధికారులకు మొదటి టాస్క్‌
మెదక్‌ అర్బన్‌: మల్కాపూర్‌ గ్రామంలో రోడ్లను శుభ్రం చేస్తున్న గ్రామస్థులు(ఫైల్‌)

నేటి నుంచి గ్రామాల్లో శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌

పంచాయతీల్లో వేధిస్తున్న నిధుల కొరత

మెదక్‌ జిల్లాకు రావాల్సిన రూ.20.25 కోట్లు

మూడు విడతల్లో ఎస్‌ఎ్‌ఫసీ నిధులు పెండింగ్‌

జిల్లాలో 469 జీపీలకు.. 469 మంది స్పెషలాఫీసర్లు

మెదక్‌ అర్బన్‌, ఫిబ్రవరి 6: గ్రామపంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ఇటీవల ముగిసింది. ఈనెల 2 నుంచి స్పెషలాఫీసర్ల పాలన ప్రారంభమైంది. దాంతో రాష్ట్ర సర్కార్‌ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. నేటి బుధవారం నుంచి 15వ తేదీ వరకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని నిర్ణయించింది. ప్రత్యేకాధికారుల పాలన మొదలైన తర్వాత మొదటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. కానీ, నిధులు కేటాయింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం. మెదక్‌ జిల్లావ్యాప్తంగా 21 మండలాల్లోని 469 గ్రామపంచాయతీలకు 469 మందిని ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది.

సర్కార్‌ మార్క్‌ కనిపించేలా

గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పల్లెప్రగతి పేరిట ఏటా జూన్‌, జూలై నెలల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టేది. ఇందుకోసం ముందుగానే గ్రామాలకు ప్రత్యేక నిఽధులు మంజూరు చేసేది. గత సర్కార్‌ మాదిరిగానే పల్లె పాలనపై తమదైన ముద్ర వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, ప్రత్యేకాధికారులతో 3న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క వారంరోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్దేశించారు. 7 నుంచి 15 వరకు అన్ని గ్రామాల్లో శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు, మహిళా సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఆ మేరకు పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణతోపాటు గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లను శుభ్రం చేయాలని, ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు.

ప్రత్యేకాధికారులకు సవాల్‌

సర్పంచుల స్థానంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఎంపీవోలు, ఆర్‌ఐ, విద్య, మిషన్‌భగీరథ అధికారులను పంచాయతీ పాలనతో సంబంఽధం లేకుండా స్పెషలాఫీసర్లుగా నియమించారు. నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభమవుతున్నది. అయితే ప్రభుత్వం నిధులు ఇస్తేనే పారిశుధ్య, తాగునీటి సమస్య పరిష్కరించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం చిన్నపాటి పనులు చేసేందుకు పలు జీపీల్లో పైసా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ఏ విధంగా పూర్తి చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పంచాయతీల స్పెషలాఫీసర్లుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అధికారులకు ఇది మొదటి సవాల్‌గా నిలువనున్నది.

వేధిస్తున్న నిధుల కొరత

జిల్లాలో ఉన్న పంచాయతీలన్నీ నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. చేసిన పనులకు బిల్లులు రాలేదని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని చాలా పంచాయతీల్లో నిధుల సమస్య నెలకొన్నది. జిల్లాకు మరోవైపు పంచాయతీలకు రావాల్సిన రాష్ట్ర ఆర్థిక సంఘం(ఎ్‌సఎ్‌ఫసీ) నిధులు మూడు విడతలకు సంబంధించి రూ.20.25 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

సొంత వనరులతో నిర్వహణ

గ్రామపంచాయతీల్లో ఉన్న సొంత వనరులతో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం. ప్రత్యేకంగా ఎలాంటి నిధులు విడుదల కాలేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎ్‌ఫసీ) గత మూడు విడతల పెండింగ్‌లో ఉన్నది. కేంద్రం ఇచ్చే 15 ఆర్థిక సంఘం నుంచి ప్రతి నెల నేరుగా గ్రామపంచాయతీ జీరో ఖాతాల్లో జమవుతున్నాయి. విడుదలైన నిధులను అన్ని గ్రామపంచాయతీల్లో నిబంధనల ప్రకారం ఖర్చు చేసేలా చూస్తున్నాం.

- సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి, మెదక్‌

పనితీరు ఆధారంగా ఉత్తమ జీపీల ఎంపిక

కోహీర్‌ ఫిబ్రవరి 6: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రత్యేక స్పెషల్‌ డ్రైవ్‌ చివరిరోజు ఫిబ్రవరి 8న పంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభలు నిర్వహించి చేసిన పనులపై అధికారులు సమీక్షించనున్నారు. మద్యపానం, మత్తు పదార్థాలు, గుట్కా వంటి వాటికి యువత దూరంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. అనంతరం పనితీరు ఆధారంగా జిల్లాస్థాయిలో ఉత్తమ జీపీలను ఎంపిక చేయనున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన కార్మికులు, గ్రామపంచాయతీలకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో అవార్డులు అందజేస్తారు. అంతేకాకుండా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో చేపట్టిన పనులకు సంబంధించి ఫొటో సెషన్‌ ఏర్పాటు చేయనున్నారు.

చేపట్టే పనులివి..

పాఠశాలలు, అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా అవగాహన కల్పిస్తారు. శిథిలాస్థకు చేరిన ప్రభుత్వ భవనాల తొలగింపు, ఉపయోగపడని బావులను పూడ్చివేయడం, రోడ్లు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను శుభ్రపరచడం, ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పించడం వంటి పనులు చేపడుతారు. మురుగు కాలువల్లో వ్యర్థపు నీరు నిల్వ ఉండకుండా పూడిక తీయడం, వీధుల్లో గుంతలను పూడ్చడం, దోమలు వృద్ధి చెందకుండా రసాయనం పిచికారీ చేయడం వంటివి స్పెషల్‌ డ్రైవ్‌లో చేయనున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:54 PM