Share News

‘కోడ్‌’ ముగిసింది.. ఆటంకం తొలిగింది !

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:55 PM

హుస్నాబాద్‌లో భవనాల ప్రారంభానికి సిద్ధం

‘కోడ్‌’ ముగిసింది.. ఆటంకం తొలిగింది !

పూర్తయిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం

రైతు బజార్‌ పనులకు తుది మెరుగులు

చివరి దశకు మున్సిపల్‌ కార్యాలయ నిర్మాణం

త్వరలో ప్రారంభించేందుకు చర్యలు

మాతా శిశు ఆరోగ్య కేంద్రం

హుస్నాబాద్‌ టౌన్‌, జూన్‌ 7 : పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ ముగియడంతో ఇక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఆటంకం తొలిగింది. హుస్నాబాద్‌ పట్టణంలో నిర్మించిన భవనాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఏళ్ల తరబడి సాగుతున్న కోట్ల రూపాయల అభివృద్ధి పనుల నిర్మాణం పూర్తయింది. ఎన్నికల కోడ్‌ ముగియడంతో త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మున్సిపల్‌ కార్యాలయ భవనం, రైతు బజార్‌ భవనం, మాతా శిశు ఆరోగ్య కేంద్రం పూర్తి కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా పోలీస్‌ డివిజన్‌ కార్యాలయ పనులు సైతం త్వరితగతిన పూర్తవుతున్నాయి.

వడివడిగా మున్సిపల్‌ భవనం

హుస్నాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. హుస్నాబాద్‌ మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. 2022 ఫిబ్రవరిలో అప్పటి ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దీనికి శంకుస్థాపన చేశారు. రూ. 2.50 కోట్లతో ఈ భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. గ్రౌండ్‌, ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లలో అధునాతనంగా నిర్మిస్తున్నారు. ఇంకా పెయింటింగ్‌, ఎలక్ట్రికల్‌, వెల్‌వేషన్‌ ఇతర పనులు చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో ఈ పనులు మందకొడిగా సాగుతున్నాయి.

రైతు బజార్‌లో మెరుగులు

హుస్నాబాద్‌ పట్టణంలోని చావడి వద్ద నిర్మిస్తున్న రైతు బజార్‌ పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నది. ఇంకా ఎలక్ట్రిసిటి, ప్లంబింగ్‌ పనులు జరుగుతున్నాయి. దీనిని రూ. 2.53 కోట్లతో నిర్మిస్తున్నారు. పలు సమస్యలతో ఆరు సంవత్సరాలకుపైగా ఈ పనులకు మోక్షం కలగలేదు. దీనికి మార్కెట్‌ శాఖ నుంచి నిధులు కేటాయించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రైతు బజార్‌కు, ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఫంక్షన్‌ హాల్‌, సెకండ్‌ ఫ్లోర్‌లో కిచెన్‌, డైనింగ్‌ హాల్‌, స్టోర్‌ రూమ్‌ నిర్మాణం చేస్తున్నారు.

సిద్ధంగా ఎంసీహెచ్‌

హుస్నాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్ర(ఎంసీహెచ్‌) భవనం ప్రారంభానికి సిద్దమైంది. రూ.7.50 కోట్లతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌కు ఒక్క బిల్లు కూడ రాలేదని తెలిసింది. ప్రారంభానికి సిద్దం చేసినా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ ఆవేదన చెందుతున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 11:55 PM