Share News

‘పది’కి సిద్ధం

ABN , Publish Date - Mar 17 , 2024 | 11:57 PM

పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

‘పది’కి సిద్ధం

నేటి నుంచి వార్షిక పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలో 121 కేంద్రాలు, 22,069 మంది..

మెదక్‌ జిల్లాలో 68 సెంటర్లు, 10,300 మంది విద్యార్థులు

పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు

ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

సంగారెడ్డి అర్బన్‌/మెదక్‌ అర్బన్‌, మార్చి 17 : పదో తరగతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈసారి నిమిషం నిబంధన ఎత్తివేశారు. విద్యార్థులను పరీక్ష సమయానికి గంట ముందు నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష సమయం దాటిన 5 నిమిషాల వరకు (9.35 గంటల వరకు) కేంద్రాలకు వచ్చిన విద్యార్థులను లోనికి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చిన వారిని అనుమతించరు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా రాష్ట్రంలోని హైదరాబాద్‌ విద్యాశాఖ కార్యాలయానికి అనుసంధానించారు. ప్రశ్నా పత్రాలను సీసీ కెమెరాల ఎదుటనే తెరవాల్సి ఉంటుంది. పరీక్షల అనంతరం సీల్‌ చేయడం కూడా కెమెరాల పర్యవేక్షణలోనే పూర్తిచేస్తారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా ఎస్‌ఎస్సీ బోర్డు అధికారులు పరీక్షల తీరును నిరంతరం పర్యవేక్షించనున్నారు. కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలను అనుమతించరు. ఆర్టీసీ బస్‌పాస్‌ ఉన్నవారు రూట్‌తో సంబంధం లేకుండా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కనిపించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉండనుంది. సమీపంలోని జిరాక్స్‌ సెంటర్లు మూసివేయిస్తారు. మాల్‌ ప్రాక్టి్‌సకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో..

పరీక్షల నిర్వహణకు సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 121 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 22,045 మంది రెగ్యులర్‌, 24 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో బాలురు 11,149 మంది, బాలికలు 10,920 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 121 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 121 డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, 1,331 ఇన్విజిలేటర్లు, 121 సిట్టింగ్‌ స్క్వాడ్‌, ఐదు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, అడిషనల్‌ డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు ఇద్దరు, జాయింట్‌ కస్టోడియన్లు 52 మంది, సి-సెంటర్‌ కస్టోడియన్లు 13 మందిని నియమించారు. జిల్లా అబ్జార్వర్‌గా మెదక్‌ డైట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ రమేశ్‌బాబును నియమించారు. సంగారెడ్డి జిల్లా విద్యార్థులు ఎలాంటి సమస్యలు, సందేహాలున్నా 9866162182 నంబర్‌లో కంట్రోల్‌రూంను సంప్రదించాలని అధికారులు సూచించారు.

మెదక్‌ జిల్లాలో..

పదో తరగతి పరీక్షలకు మెదక్‌ జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లావ్యాప్తంగా 68 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 10,300 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో.. బాలురు 5,079మంది, బాలికలు 5,221 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 3 ఫ్లయింగ్‌ బృందాలు, 19 సిట్టింగ్‌ స్క్వాడ్‌, కస్టోడియన్‌ బృందాలు, 550 మంది ఇన్విజిలేటర్లు, 68 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 68 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులను ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. విద్యార్థులు ఏ సమస్య ఉన్నా సమాచారం ఇవ్వడానికి డీఈవో కార్యాలయంలోని కంట్రోల్‌రూంను 9032625296 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలియజేశారు.

Updated Date - Mar 18 , 2024 | 12:00 AM