Share News

‘పది’ పరీక్షలు షురూ

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:34 PM

పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సోమవారం ప్రథమ భాష తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విద్యార్థులు కేంద్రాలకు ఉదయం ఎనిమిది గంటల నుంచే చేరుకోవడం కనిపించింది.

‘పది’ పరీక్షలు షురూ

తొలి రోజు ప్రశాంతం

సంగారెడ్డి జిల్లాలో 99.82 శాతం, మెదక్‌ జిల్లాలో 99.71 శాతం హాజరు

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఉన్నతాధికారులు

సంగారెడ్డి అర్బన్‌/మెదక్‌ అర్బన్‌, మార్చి 18 : పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సోమవారం ప్రథమ భాష తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విద్యార్థులు కేంద్రాలకు ఉదయం ఎనిమిది గంటల నుంచే చేరుకోవడం కనిపించింది. ముందుగానే చేరుకుని సెంటర్‌, హాల్‌టికెట్‌ నంబర్లను సరిచూసుకున్నారు. మొదటిరోజు కావడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ, భయం కనిపించింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా కేంద్రాల వద్దకు తరలివచ్చారు. పరీక్ష పూర్తయ్యేంత వరకు పరీక్షా సెంటర్ల వద్ద వేచి ఉన్నారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని పేర్కొన్నా.. ఎక్కడా ఆలస్యంగా రాలేదు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించడంతో పాటు సమీపంలో ఉన్న జిరాక్స్‌ సెంటర్లను మూసివేయించారు.

సంగారెడ్డి జిల్లాలో 121 కేంద్రాల్లో పదో తరగతి పరీక్ష నిర్వహించారు. తొలిరోజు సోమవారం 22,029 మంది విద్యార్థులకుగాను 21,990 మంది హాజరయ్యారు. 99.82 హాజరు శాతం నమోదైంది. జిల్లాలో ఎక్కడా మాల్‌ప్రాక్టిస్‌ జరిగినట్టు కేసు నమోదు కాలేదని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. పలు పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేష్‌ తనిఖీ చేశారు. సంగారెడ్డి పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్‌ ఆర్నాల్డ్స్‌ హైస్కూల్‌ కేంద్రాలను కలెక్టర్‌, ఎస్పీ సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. జిన్నారం జడ్పీహెచ్‌ఎ్‌స, బొంతపల్లి జడ్పీహెచ్‌ఎ్‌స, మోడల్‌స్కూల్‌, బొల్లారం జడ్పీహెచ్‌ఎ్‌స, బొల్లారం మోడల్‌స్కూల్‌లోని పరీక్షా కేంద్రాలను జిల్లా పరిశీలకుడు శివరమేశ్‌బాబు పరిశీలించారు. సంగారెడ్డి మండలంలోని రెండు, చౌటకూర్‌ మండలంలోని రెండు, అందోల్‌ మండలంలోని నాలుగు పరీక్షా కేంద్రాలను డీఈవో వెంకటేశ్వర్లు పరిశీలించగా, 33 కేంద్రాలను ప్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీ చేశాయి.

మెదక్‌ జిల్లాలో..

మెదక్‌ జిల్లావ్యాప్తంగా టెన్త్‌క్లాస్‌ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 68 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా జిల్లా పరీక్షల విభాగం అధికారి రామేశ్వర్‌రావు ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. జిల్లాలో 10,303 మంది విద్యార్థులకు 10,274 మంది హాజరయ్యారు. 99.71 శాతం హాజరు నమోదైనట్టు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు.

తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

కౌడిపలిల్లోని జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని మెదక్‌ అదనపు కలెక్టర్‌ రమేష్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులన్నీ కలియదిరిగి విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సరళిని పరిశీలించారు. కేంద్రంలో సదుపాయల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి, వేసవి దృష్ట్యా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. డీఈవో రాధాకిషన్‌ రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాల్లోని 9 పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఫ్ౖలయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పాపన్నపేట, మనోహరాబాద్‌, తూప్రాన్‌, చేగుంటలోని 18 కేంద్రాలను సందర్శించాయి. ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని డీఈవో వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎలాంటి సందేహాలున్న డీఈవో కార్యాలయంలో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్‌రూంను 90326 25296లో సంప్రదించాలని ఆయన సూచించారు.

Updated Date - Mar 18 , 2024 | 11:34 PM