పీఎం విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:31 PM
మెదక్ అర్బన్, ఫిబ్రవరి 6: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా అర్హులను కోరారు. మంగళవారం తన ఛాంబర్‌లో జిల్లా అధికారులతో పథకంపై సమీక్ష నిర్వహించారు.
మెదక్ కలెక్టర్ రాజర్షిషా
మెదక్ అర్బన్, ఫిబ్రవరి 6: ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా అర్హులను కోరారు. మంగళవారం తన ఛాంబర్‌లో జిల్లా అధికారులతో పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కులవృత్తుల వారిని గుర్తించి నైపుణ్యాలను అభివృద్ధి చేసి, వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి జీవనోపాధిని పెంపొందించేందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పథకంపై పట్టణ, మండలాల్లో స్వయం సహాయక బృందాలు, పట్టణాభివృద్ధి సంస్థ రిసోర్స్ పర్సన్స్ ద్వారా విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కృష్ణమూర్తి, సాయిబాబా, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, మెప్మాపీడీ ఇందిరా తదితరులు పాల్గొన్నారు.
పది, ఇంటర్‌లో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
తూప్రాన్, ఫిబ్రవరి 6: పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా అధ్యాపకులు, ఉపాధ్యాయులు కృషిచేయాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. మంగళవారం తూప్రాన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జడ్పీహెచ్‌ఎ్‌స పాఠశాల, తెలంగాణ గురుకుల కళాశాలను ఇంటర్ జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, జిల్లా విద్యాధికారి రాఽధాకిషన్‌తో కలిసి కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. పది, ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతోపాటు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఇంటి వద్ద తీసుకోవాల్సిన చర్యలు, ప్రిపరేషన్ గురించి పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న అల్పాహారాన్ని పరిశీలించి రచి చూశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయచందర్, ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. అలాగే తూప్రాన్ మండల పరిధిలోని ఘణపూర్‌లోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను జడ్పీసీఈవో శైలేష్ మంగళవారం సందర్శించి, ఉత్తమ ఫలితాలకై ఉపాధ్యాయుల, విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.