Share News

ఈత.. గౌడ్‌లకు చేయూత

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:31 PM

సిద్దిపేట అర్బన్‌, ఏప్రిల్‌ 17: సిద్దిపేట అర్బన్‌ మండలం కిష్టసాగర్‌ గ్రామంలో హరితహారంలో భాగంగా నాటిన ఈత వనాలు గౌడ్‌లకు ఉపాధిని చూపుతున్నాయి. మొత్తం 600 చెట్ల నుంచి ప్రతిరోజూ 500 లీటర్ల కల్లు వస్తున్నది.

ఈత.. గౌడ్‌లకు చేయూత
పొన్నాల సమీపంలోని కిష్టసాగర్‌ పరిధిలో ఈత వనంలో చెట్లు గీస్తున్న గౌడన్నలు

హరితహారంలో 5 ఎకరాలలో 5 వేలకుపైగా మొక్కలు

ప్రస్తుతం చేతికందిన 600 చెట్లు

ప్రతిరోజూ 500 లీటర్ల కల్లు

60 మంది గౌడన్నలకు ఉపాధి

సిద్దిపేట అర్బన్‌, ఏప్రిల్‌ 17: సిద్దిపేట అర్బన్‌ మండలం కిష్టసాగర్‌ గ్రామంలో హరితహారంలో భాగంగా నాటిన ఈత వనాలు గౌడ్‌లకు ఉపాధిని చూపుతున్నాయి. మొత్తం 600 చెట్ల నుంచి ప్రతిరోజూ 500 లీటర్ల కల్లు వస్తున్నది.

గౌడన్నలకు చేయూతగా ప్రభుత్వాలు

గౌడన్నలకు చేయూతనందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కిష్టసాగర్‌ గ్రామ సమీపంలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు కృషితో సుమారు 5 వేల ఈత మొక్కలను దశలవారీగా గౌడన్నలు నాటుకున్నారు. వాటి సంరక్షణ కోసం 60 మంది గౌడ కులస్తులు సొసైటీ ఏర్పాటు చేసుకుని పరిరక్షిస్తున్నారు.

మొక్కలు ఎదిగి..

దశలవారీగా నాటుకున్న 5 వేల ఈత మొక్కలలో ప్రస్తుతం 600కు పైగా ఈత చెట్లు చేతికందాయని గౌడ కులస్తులు చెబుతున్నారు. రోజూ 300 చొప్పున ఈత చెట్లకు కల్లు గీస్తున్నారు. రోజుకు సుమారు 500 లీటర్ల స్వచ్ఛమైన కల్లు లభిస్తుంది. వచ్చేనెల 15 రోజుల్లో మరో 600 చెట్లు చేతికిందే అవకాశం ఉండడంతో మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉన్నది.

ఆర్థిక భరోసాకు చక్కటి మార్గం

గతంతో పోల్చుకుంటే గ్రామాల్లో ఈత వనాల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతో గౌడ కులస్తులకు ఉపాధి తగ్గే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో హరీశ్‌రావు కృషితో గౌడ కులస్తులకు ఈత మొక్కలను పంపిణీ చేశారు. గౌడ సొసైటీలకు సంబంధించిన స్థలం ఎక్కడుంటే అక్కడ మొక్కలను నాటుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ అవకాశమే నేడు పొన్నాల గౌడ కులస్తులు ఆర్థికంగా ఎదగడానికి చక్కటి మార్గాన్ని చూపింది. సొసైటీలో మొత్తం 60 మంది సభ్యులు ఉండగా.. కొంతమంది కార్మికులు ఆరోగ్యరీత్యా, వయస్సు రీత్యా వృత్తిలోకి రానప్పటికీ మిగతా గౌడన్నలు వారి చెట్లను దత్తత తీసుకొని వృత్తిని కొనసాగిస్తున్నారు.

కులవృత్తులను ప్రోత్సహించడానికే..

కులవృత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా అన్నిరంగాల కులస్తుల ఆర్థికాభివృద్ధికి అవసరమైన సహాయ, సహకారాలను అందించాం. అవకాశాలను సద్వినియోగపర్చుకుని గౌడన్నలు ఆర్థికంగా ఎదగడం సంతోషాన్నిస్తుంది. కులవృత్తులను ఉపయోగించుకుని అన్ని కులాల వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాం.

- హరీశ్‌రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే

ఆర్థికంగా మాకు ఎంతో అండ

గ్రామీణ ప్రాంతాల్లో ఈతవనాల సంఖ్య తగ్గిపోవడంతో కులవృత్తులు చేపట్టలేక ఇతర వృత్తుల కోసం వెతికే సమయంలో ప్రభుత్వాల అండదండలతో ఏర్పాటు చేసుకున్న ఈత వనం మా ఆర్థికాభివృద్ధికి అండగా నిలబడింది. పనులు చేతికందని సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో 600 చెట్లు చేతికంది మాకు లాభాలను అందిస్తున్నాయి.

- బొల్గం శ్రీనివా్‌సగౌడ్‌, పొన్నాల

చేతినిండా పని దొరుకుతుంది

గతంలో పని దొరక్క అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతానికి ఈత వనంలో వందల సంఖ్యలో చెట్లు చేతికందడంతో పని దొరుకుతుంది. ఆర్థికంగా కూడా చక్కటి అవకాశం లభిస్తుంది.

- సురేష్‌గౌడ్‌, పొన్నాల

Updated Date - Apr 17 , 2024 | 11:31 PM