Share News

నిలిచిన నిధులు.. ఆగిన పనులు

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:20 PM

మెదక్‌ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 29: మెదక్‌ జిల్లా కేంద్రంలో దశాబ్ద కాలం తర్వాత ప్రారంభించిన రాందాస్‌ చౌరస్తాలోని మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులు నిధుల లేమీతో పాటు మారుతున్న డిజైన్ల కారణంగా అసంపూర్తిగానే నిలిచిపోయాయి.

నిలిచిన నిధులు.. ఆగిన పనులు
రాందాస్‌ చౌరస్తాలో సెల్లార్‌ వద్ద నిలిచిపోయిన మున్సిపల్‌ కాంప్లెక్స్‌ పనులు

మారుతున్న డిజైన్లతో పెరుగుతున్న భారం

జిల్లా కేంద్రంలో వెక్కిరిస్తున్న అసంపూర్తి నిర్మాణాలు

మెదక్‌ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 29: మెదక్‌ జిల్లా కేంద్రంలో దశాబ్ద కాలం తర్వాత ప్రారంభించిన రాందాస్‌ చౌరస్తాలోని మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులు నిధుల లేమీతో పాటు మారుతున్న డిజైన్ల కారణంగా అసంపూర్తిగానే నిలిచిపోయాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏప్రిల్‌లో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి చేతులమీదుగా రెండు పనులకు భూమి పూజ చేశారు. అప్పట్లో కొంత పనులు జరిగినా.. ఆరు నెలల నుంచి ముందుకు సాగడం లేదు. మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికిగాను రూ.3 కోట్ల అంచనా వేయగా ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన నిధులు వినియోగించుకునేందుకు ప్రణాళికలు చేశారు. అంతేగాకుండా కాంట్రిబ్యూషన్‌, పట్టణ ప్రగతి నిధులతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులు చేపట్టేందుకు పాలకమండలి నిర్ణయించింది. ప్రస్తుతం సెల్లార్‌ లెవల్‌ వరకు పనులు చేయగా ఇప్పటివరకు రూ.38 లక్షలను కాంట్రాక్టర్‌కు చెల్లించారు. అంచనాలకు మించి సెల్లార్‌ తవ్వకం జరగడం, స్థల వినియోగంలో మార్పులు రావడంతో కొత్తగా డిజైన్లు రూపొందించారు. కానీ అనుమతి రాకపోవడంతో ఆ పనులు కాస్తా నిలిచిపోయాయి. ఇదేకాకుండా మరో రూ.30 లక్షలు కాంట్రాక్టర్‌కు రావాలని తెలుపుతుండగా... నిధులు విడుదల చేయడం లేదని తెలిసింది. ఓ వైపు నిధులు, మరోవైపు డిజైన్స్‌ అనుమతి లభిస్తే కానీ పనులు చేపట్టలేమని కాంట్రాక్టర్‌ పేర్కొంటున్నారు. డిజైన్స్‌ అనుమతి లభిస్తే నిర్మాణ వ్యయభారం మరో రూ.2 కోట్లు పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు పేర్కొంటున్నారు.

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ది అదే పరిస్థితి

జిల్లా కేంద్రంలో రెండు, మూడు స్థలాల పరిశీలన అనంతరం ఆర్డీవో కార్యాలయం వెనక రూ.6 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ పనులు ఎట్టకేలకు ప్రారంభించారు. ప్రస్తుతానికి భూ స్థాయిలో బెడ్‌ వేసి పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటివరకు రూ.70 లక్షల పనులకు రికార్డింగ్‌ పూర్తి అయినా ఇప్పటివరకు నిధులు రాలేదని కాంట్రాక్టర్‌ తెలిపారు. ఇక్కడా భూ పరిస్థితులను బట్టి డిజైన్స్‌ మారడంతో నిర్మాణం వ్యయం రూ.8 కోట్లకు పెరిగే అవకాశమున్నదని తెలిసింది. నిధులు విడుదల కానిదే పనులు ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు.

అనుమతులు కోసం కృషి చేయాలి

మున్సిపల్‌ కాంప్లెక్స్‌, ఇంటిగ్రేటెడ్‌ పనులు నిలిచిపోవడానికి ప్రధాన కారణమైన డివేయేషన్‌ డిజైన్స్‌ అనుమతులు తీసుకురావడంలో ఉన్నతాధికారులు, మున్సిపల్‌ అధికారులు కృషిచేయాల్సి ఉన్నది. ఆరునెలలుగా పనులు నిలిచిపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి అనుమతులతో పాటు కాంట్రాక్టర్‌కు నిధులు విడుదల చేసే విషయంలో కృషిచేస్తే అభివృద్ధి పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉన్నది.

నిధులు విడుదల కావడం లేదు

మున్సిపల్‌ పరిధిలో నిర్మాణంలో ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులకు సంబంధించిన రూ.30 లక్షలు కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సి ఉన్నది. నిధుల లేమి కారణంగా డబ్బులు చెల్లించలేదు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులు ప్రారంభమైనా నిధుల కేటాయింపులో అప్పటి, ఇప్పటి ప్రభుత్వాలు ఇంకా స్పష్టతనివ్వలేదు. దీంతో ఈ పనులు కూడా నిలిచిపోయినట్లు వివరించారు. ఈ రెండు నిర్మాణాల్లో మార్పులు ఉన్నందున తిరిగి అనుమతులు పొందాల్సిన అవసరం ఉన్నది.

- మహేష్‌, డీఈ

Updated Date - Feb 29 , 2024 | 11:20 PM