Share News

నిలిచిపోయిన ట్రైడెంట్‌ వేలం ప్రక్రియ

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:45 PM

జహీరాబాద్‌, ఫిబ్రవరి 28: జహీరాబాద్‌ మండలంలోని కొత్తూర్‌(బి) గ్రామంలో గల ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారం వేలం ప్రక్రియ బుధవారం నిలిచిపోయింది.

నిలిచిపోయిన ట్రైడెంట్‌ వేలం ప్రక్రియ
ట్రైడెంట్‌ కర్మాగారం వేలం పాటకు ఏర్పాట్లు చేసిన అధికారులు

జహీరాబాద్‌, ఫిబ్రవరి 28: జహీరాబాద్‌ మండలంలోని కొత్తూర్‌(బి) గ్రామంలో గల ట్రైడెంట్‌ చక్కెర కర్మాగారం వేలం ప్రక్రియ బుధవారం నిలిచిపోయింది. యాజమాన్యం చెరకు రైతులకు రూ.7.38 కోట్ల పెండింగ్‌ బిల్లులతోపాటు, కార్మికుల వేతనాలు రూ.2 కోట్లను కలుపుకుని మొత్తం 9.38 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని చక్కెరశాఖ అధికారి రాజశేఖర్‌ తెలిపారు. అయితే కర్మాగారం పెండింగ్‌ బిల్లులు ఇవ్వడంలో మొండికేయడం మూలంగానే ఉన్నతాధికారుల ఆదేశాలతో రెవెన్యూ రికవరీ చట్టం కింద బుధవారం కర్మాగారాన్ని వేలం వేసేందుకు నిర్ణయించామన్నారు. అందులో భాగంగా రెవెన్యూ, చక్కెరశాఖ, తదితర శాఖలకు చెందిన అధికారులు కర్మాగారాన్ని వేలం వేసేందుకు వెళ్లారు. దీంతో వేలం పాటలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. స్థానికంగా కర్మాగారం వద్ద నెలకొన్న విషయాన్ని కలెక్టర్‌కు విన్నవిస్తామని రాజశేఖర్‌ తెలిపారు. ఇదిలా ఉండగా కర్మాగారానికి చెందిన ఓ డైరెక్టర్‌ మాత్రం మంగళవారం రాత్రి రైతుల ఖాతాల్లో సుమారు రూ.5 కోట్లు వేశారని, ఇంకా రూ.4.38 కోట్లు వేయాల్సి ఉన్నదన్నారు. కర్మాగారాన్ని మరోమారు వేలం వేసేందుకు తేదీలను ఖరారు చేస్తారా లేదా అనే విషయం ఉన్నతాధికారుల నిర్ణయాన్ని బట్టి ఉంటుందని ఆయన వివరించారు. ఈ వేలం పాటలో జహీరాబాద్‌ ఇన్‌చార్జి తహసీల్దార్‌ మల్లే్‌షకుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ వంశీ, ఆర్‌ఐ రుక్మోద్దీన్‌, వివిధశాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 11:45 PM