Share News

అటకెక్కిన తాగునీటి పరీక్షలు

ABN , Publish Date - May 25 , 2024 | 11:31 PM

పంచాయతీలకు క్లోరోస్లోప్‌ కిట్ల అందజేత ప్రజాఆరోగ్యంపై అధికారుల నిర్లక్ష్యం

 అటకెక్కిన తాగునీటి పరీక్షలు
గ్రామపంచాయతీలకు పంపిణీ చేసిన క్లోరోస్లోప్‌ కిట్లు

మిరుదొడ్డి, మే 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా గ్రామాలకు సరఫరా చేసే మిషన్‌ భగీరథ నీరు కలుషితమయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో ప్రభుత్వం నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడానికి మిషన్‌ భగీరథ అధికారులకు, ప్రతిగ్రామపంచాయతీకి క్లోరోస్లోప్‌ కిట్లను అందజేసింది. గ్రామాల్లో నీటి పరీక్షల బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. నీటి పరీక్షలపై అధికారులు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కూడా కల్పించారు.

నెరవేరని లక్ష్యం

ఉమ్మడి మిరుదొడ్డి మండలంలోని 21 గ్రామపంచాయతీలకు క్లోరోస్లోప్‌ కిట్లను అందజేశారు. శుద్ధజలం సరఫరా కోసం ప్రతిరోజు గ్రామపంచాయతీలకు వచ్చే నీటిని పరిక్షించిన తర్వాతనే నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ప్రజారోగ్యంపట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీని కారణంగా ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.

వ్యాధుల నియంత్రణ ఎలా

శుద్ధ జలాన్ని తాగడం వల్ల వివిధ రకాల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. కొన్ని పల్లెల్లో నీరు రంగు మారి రావడంతో మురికినీరు కలుస్తుందన్న ఉద్దేశంతోనే క్లోరోస్లోప్‌ కిట్లను అందించింది. గ్రామాల్లో ఎక్కడా నీటి పరీక్షలు చేసిన దఖాలాలు కనిపించడం లేదు. గతంలో కూడా ప్రభుత్వ శుద్ధజల కిట్లకు గ్రామపంచాయతీలకు అందజేసింది. దీంతో ఆ కిట్లు కూడా మూలనపడ్డాయి. అయితే కొన్నిగ్రామాల్లో నామమాత్రంగా నీటిపరీక్షలు జరిగాయి. అయితే ప్రతి గ్రామపంచాయతీకి కార్యదర్శి ఉండడంతో నీటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. కీట్లలోని రసాయనాలు అయిపోతే గ్రామపంచాయతీ నిధులతో కొనుగోలు చేసే వెసులుబాటును కూడా కల్పించింది. అయినా గ్రామపంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - May 25 , 2024 | 11:31 PM