Share News

భూసార పరీక్షా కేంద్రం అలంకారప్రాయం

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:55 PM

లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భూసార పరీక్షా కేంద్రం అలంకారప్రాయంగా మారిపోయింది.

భూసార పరీక్షా కేంద్రం అలంకారప్రాయం
గజ్వేల్‌లోని పరీక్షా కేంద్రం

గజ్వేల్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో నిర్మించిన భూసార పరీక్షా కేంద్రం

9 నెలలుగా భూసార పరీక్షల ఊసేలేదు

పరికరాలు, సిబ్బంది కేటాయింపే కరువు

ప్రశ్నార్థకంగా గజ్వేల్‌లోని పరీక్షా కేంద్రం భవిష్యత్తు!!

గజ్వేల్‌, జనవరి 3: లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భూసార పరీక్షా కేంద్రం అలంకారప్రాయంగా మారిపోయింది.

పంట దిగుబడులు గణనీయంగా పెరగడానికి సూచనలు ఇవ్వాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. మట్టి నమునాలు సేకరించి పరీక్షలు నిర్వహించి అన్నదాతలకు దన్నుగా నిలవాలన్న సదుద్దేశంతో గజ్వేల్‌లోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో భూసార పరీక్షా కేంద్రాన్ని రూ.81.20 లక్షల వ్యయంతో నిర్మించి, 21, ఏప్రిల్‌ 2023న అప్పటి జిల్లా మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. నెలలు గడిచినా పరీక్షా కేంద్రానికి సిబ్బందిని కేటాయించింది లేదు. పరికరాలను అందించింది లేదు. దీంతో భూసార పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి ఉందని రైతులు భావిస్తుండగానే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోయి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పరికరాలు, సిబ్బందిని కేటాయిస్తుందా లేదా అన్న ప్రశ్న తలెత్తుతుంది.

జిల్లా కేంద్రంలోనే పరీక్షా కేంద్రం

ప్రస్తుతానికి సిద్దిపేట జిల్లా కేంద్రంలో కేవలం ఒకే ఒక్క భూసార కేంద్రం ఉంది. ఇక్కడికి రైతులు మట్టి నమునాలను తీసుకువెళ్లాలంటే దూరాభారంతో పాటు ఖర్చుతో కూడుకున్న పని. దీంతో రైతులు ఎవరూ భూసార పరీక్షలకు ముందుకు రావడం లేదు. గజ్వేల్‌లో ఏర్పాటు చేసి రైతులకు భూసార పరీక్షలను చేరువ చేయాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా కనిపించడం లేదు. ఎంతో హంగు ఆర్భాటంగా భూసార పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన గత ప్రభుత్వం... పరికరాలను, సిబ్బందిని కేటాయించకపోవడం ఏంటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరీక్షా కేంద్రానికి ఏడీఏతో పాటు ఏవోలు, ఏఈవోలు, ల్యాబ్‌ అసిస్టెంట్లు, అటెండర్ల అవసరం ఉంది. పరీక్షల నిమిత్తం పరికరాలు, కెమికల్స్‌ అవసరమవుతాయి. కానీ వాటిని కేటాయించకపోవడంతో గత ప్రభుత్వ సంకల్పం నెరవేరకపోగా, రైతులకు భూసార పరీక్షలు చేరువయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

భూసార పరీక్షా కేంద్రంతో ఇష్టారీతిన

ఎరువుల వాడకానికి చెక్‌

భూసార పరీక్షా కేంద్రం ఏర్పాటై పరీక్షలు జరిగితే భూమికి అనుగుణంగా పంటలతో పాటు అవసరమైన మేర ఎరువులను వేసుకునే వెసులుబాటు ఉంటుంది. భూసార పరీక్షలు జరపకపోవడంతో రైతులు ఇష్టారీతిన ఎరువులను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఏకబిగిన ఒకే పంటను వేస్తూ అనేక నష్టాలకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో దాదాపుగా ఆరు లక్షల ఎకరాల్లో ఆయా పంటలను రైతులు సాగుచేస్తున్నారు. నేల స్వభావం తెలియకపోవడంతో రైతులు ఎరువులను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. దీంతో దిగుబడులు తగ్గడం, పెరగడం, నేల తన సహజ స్వభావాన్ని కోల్పోవడంతో పాటు రైతులపై ఆర్థిక భారం పడుతుంది. భూసార పరీక్షలు నిర్వహిస్తే పోషకాల లోపాలను గుర్తించి అవసరమైన మేరకే ఎరువులను వినియోగించే వీలు కలుగుతుంది.

కొత్త ప్రభుత్వం చొరవ చూపేనా?

ఇటీవలే రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మారి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. మొన్నటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న గజ్వేల్‌ ఎమ్మెల్యే కేసీఆర్‌ మాజీ ముఖ్యమంత్రిగా మారిపోయారు. ఈ నేపథ్యం లో గజ్వేల్‌లో నిర్మించిన భూసార పరీక్షా కేంద్రానికి కావాల్సిన సిబ్బంది, పరికరాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తుందా లేదా అన్న అనుమానం రైతుల్లో వ్యక్తమవుతున్నది. తొమ్మిది నెలల క్రితం భవనాన్ని నిర్మించినా ఇప్పటి వరకు ఒక్క పరీక్ష జరగకపోవడం గమనార్హం.

Updated Date - Jan 03 , 2024 | 11:55 PM