Share News

శరభ..శరభ

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:45 PM

ఓం వీరభద్ర శరభ.. శరభ.. ఓం రుద్రకాళి.. ఓం భద్రకాళి.. ఓం..ఓం..ఓం నమఃశ్శివాయ అని దేవతామూర్తులను స్తుతిస్తూ వీరశైవార్చకుల దండకాలు, వీరశైవపండితులు చేసిన మంత్రోచ్ఛారణలతో కొమురవెల్లి మారుమోగింది.

శరభ..శరభ
అగ్నిగుండాలను దాటడం ప్రారంభిస్తున్న వీరశైవార్చకులు

గుండాలు దాటాం మల్లన్నా.. మా గండాలు ఎడబాపు!

ఘనంగా కొమురవెల్లి మల్లన్న అగ్నిగుండాలు

హాజరైన కేదార్‌నాథ్‌ ఆలయ ప్రధానార్చకుడు లింగప్పస్వామి,

వీరశైవ జగద్గురు చెన్నబసవలింగప్రభు మహాస్వామి

ముగిసిన మూడునెలల మహాజాతర

చేర్యాల, ఏప్రిల్‌ 8 : ఓం వీరభద్ర శరభ.. శరభ.. ఓం రుద్రకాళి.. ఓం భద్రకాళి.. ఓం..ఓం..ఓం నమఃశ్శివాయ అని దేవతామూర్తులను స్తుతిస్తూ వీరశైవార్చకుల దండకాలు, వీరశైవపండితులు చేసిన మంత్రోచ్ఛారణలతో కొమురవెల్లి మారుమోగింది. కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఆలయ తోటబావిప్రాంగణంలో వీరశైవసంప్రదాయం ప్రకారం అగ్నిగుండాలను అత్యంత భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఈసందర్భంగా ఐదురకాల వంట చెరుకును అమర్చి అగ్నిగుండాలను తయారుచేశారు. శాస్ర్తోక్తయుక్తంగా, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అష్టదిక్కులా గుమ్మడి కాయలతో బలిహరణ జరిపి వీరశైవుల గురువుకు పాద పూజ జరిపారు. అనంతరం మల్లన్నను కీర్తిస్తూ అగ్నిగుండాలను దాటారు. గుండాలు దాటాం.. మా గండాలను ఎడబాపుమని వేడుకున్నారు. అగ్నిగుండాల కార్యక్రమానికి కేదార్‌నాథ్‌ ఆలయ ప్రధానార్చకుడు శివలింగప్పస్వామి, వీరశైవ జగద్గురు చెన్నబసవప్రభు మహాస్వామి హాజరయ్యారు. అగ్నిగుండాల కార్యక్రమ నిర్వహణ అనంతరం మల్లన్న ఆలయంలో వీరశైవార్చకులు విజయోత్సవం, ఏకాదశ రుద్రాభిషేకం, జంగ మార్చన తదితరపూజా కార్యక్రమాలు నిర్వహించారు. శాస్త్రోక్తయుక్తంగా, సాంప్రదాయబద్దంగా పూజలు జరిపి ఉత్సవాలను ముగించారు. హుస్నాబాద్‌ ఏసీపీ వాసాల సతీశ్‌ ఆధ్వర్యంలో డివిజన్‌స్థాయి పోలీసులు బందోబస్తు చేపట్టారు. వేడుకల్లో ఆలయ ఈవో బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ పర్పాటకం లక్ష్మారెడ్డి, ఏఈవో బుద్ధి శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ నీలశేఖర్‌, ఉద్యోగులు, దర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

వచ్చే యేడు మళ్లొస్తాం మల్లన్నా..

జనవరి 7న స్వామివారి కల్యాణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన అగ్నిగుండాలతో ముగిశాయి. చివరి ఘట్టమైన అగ్నిగుండాలకు వేలాదిమంది భక్తులు తరలిరాగా సోమవారం ఉదయం మూటముల్లే సర్ధుకుని వెనుదిరిగారు. కోరిన కోర్కెలు తీర్చే మల్లన్నస్వామి వెళ్లొస్తాం.. వచ్చే యేడు మళ్లొస్తామని వేడుకుంటూ భక్తులు ఇంటిముఖం పట్టారు.

రూ.48.50లక్షలు బుకింగ్‌ ఆదాయం

అగ్నిగుండాలు తిలకించేందుకు చివరివారాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో శనివారం రూ.3,99,797, ఆదివారం రూ.41,11,797 సోమవారం సుమా రు రూ.3లక్షల చొప్పున రూ.48.50లక్షల మేర బుకింగ్‌ ఆదాయం సమకూరింది.

Updated Date - Apr 08 , 2024 | 11:45 PM