Share News

సంబరాల సంక్రాంతి

ABN , Publish Date - Jan 14 , 2024 | 12:20 AM

పల్లెలు, పట్టణాల్లో పండుగ శోభ

సంబరాల సంక్రాంతి

- ఇంటింటా పిండివంటల ఘుమఘుమలు

- నేడు భోగి పండుగ.. రేపు సంక్రాంతి

- ఊరూవాడా నెలకొన్న సందడి

కొండపాక, జనవరి 13 : పల్లెలు, పట్టణాలకు సంక్రాంతి పండుగ శోభ వచ్చేసింది. ఊరువాడ పండుగ సందడి మొదలైంది. ఇంటింటా పిండివంటలు ఘుమఘుమలు ఆహా అనిపిస్తున్నాయి. సకినాలు, అరెసలు, లడ్డూలు వంటి రకరకాల పిండివంటల తయారీలో మహిళలు బిజీబిజీగా ఉన్నారు. ఊరువాడ భోగి, సంక్రాంతి, కనుమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆదివారం భోగి పండుగను జరుపుకోనున్నారు. దీంతో మార్కెట్లు రద్దీగా మారా యి. రంగులు, గరిక, పేడ, రేగుపండ్లు కొనుగోలు చేస్తు న్నారు.

మూడు రోజుల పాటు సంబురం

గంగిరెద్దుల విన్యాసాలు, రంగురంగుల ముగ్గుల లోగిళ్లు, గొబ్బెమ్మలు, భోగి పళ్లు, పిండి వంటలు, పతంగులు, భోగిమంటల సంబురం సంక్రాంతి. మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. సంవత్సరాన్ని రెండు ఆయనములుగా మనం విభజించుకుంటున్నాం. కటక సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు దక్షిణాయనంగా, మకర సంక్రమణం నుంచి కటక సంక్రమణం వరకు ఉత్తరాయణంగా పరిగణిస్తారు. ఉత్తరాయణం దేవతా పూజకు, దక్షిణాయనం పితృదేవతారాధనకు ప్రధానం. ఉత్తరాయణం ప్రారంభమయ్యే మకర సంక్రాంతి నుంచి ప్రకృతి రమణీయంగా ఉంటుంది. పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు చేరుకుంటాయి. పశుపక్ష్యాదులు ఆనందంగా కనిపిస్తాయి. మూడు రోజుల పండుగలలో మొదటి రోజు కట్టెలను, పిడకలను కాల్చి భోగి మంట వేస్తారు. ఈ మంటలో మనలోని అసూయ, ద్వేషాన్ని వేసి, వెలుతురు అనే జ్ఞానాన్ని పొందాలనేది ఇందులో తాత్త్వికాంశం. సాయంత్రం వేళ చిన్న పిల్లలకు భోగిపళ్లు పోస్తారు. రెండో రోజు మకర సంక్రాంతి పర్వదినం. గృహస్థులు మకర సంక్రాంతి రోజున ఇంటి మధ్య చుట్టూ నాలుగు పిడతలను, మధ్యలో ఒక పిడత, చిన్న కుండ పెట్టి, అందులో ఆవు పాలు పోసి పొంగే దాకా కింద ఆవు పిడకలతో మండిస్తారు. పాలు పొంగినట్టు సిరి సంపదలు పొంగిపొర్లాలని ధాన్యలక్ష్మిని ప్రార్థిస్తారు. మూడో రోజు కనుమ పండుగ నాడు మహిళలు పసుపు బొట్టు పంపిణీ చేసుకుంటారు.

రంగవల్లులు.. గొబ్బెమ్మలు

సంక్రాంతి అంటే ఇళ్ల వాకిళ్లల్లో రంగురంగుల ముగ్గులు సరికొత్త అందాన్ని తెచ్చిపెడుతాయి. గృహిణులు, యువతులు ముగ్గులు వేయడానికి పోటీపడతారు. ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు ప్రత్యేకం. గొబ్బెమ్మలను పేడతో తయారు చేసి వాటిని పసుపు, కుంకుమ, గరిక, పిండి పూతలతో అలంకరిస్తారు. ముగ్గుల మధ్య ఉంచి పువ్వులు, నవ ధాన్యాలు, రేగు పండ్లను వేస్తారు.

Updated Date - Jan 14 , 2024 | 12:20 AM