Share News

సదాశివపేట బల్దియాలో క్యాంపు రాజకీయం

ABN , Publish Date - Feb 05 , 2024 | 11:58 PM

సదాశివపేట మున్సిపాలిటీలో రాజకీయాలు పక్క రాష్ట్రాలకు చేరుకున్నాయి! చైర్‌పర్సన్‌పై ఇచ్చిన అవిశ్వాసం నోటీసులపై ఓటింగ్‌ నిర్వహించేందుకు ఈ నెల 9వ మున్సిపల్‌ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.

సదాశివపేట బల్దియాలో క్యాంపు రాజకీయం

విహారయాత్రకు 22 మంది కౌన్సిలర్లు

అన్ని పార్టీల వారితో కలిసి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేత

కాంగ్రెస్‌ మద్దతుతో తన సతీమణికి చైర్మన్‌గిరి!

కాంగ్రెస్‌ గూటికి చేరతారని ప్రచారం

సదాశివపేట, ఫిబ్రవరి 5: సదాశివపేట మున్సిపాలిటీలో రాజకీయాలు పక్క రాష్ట్రాలకు చేరుకున్నాయి! చైర్‌పర్సన్‌పై ఇచ్చిన అవిశ్వాసం నోటీసులపై ఓటింగ్‌ నిర్వహించేందుకు ఈ నెల 9వ మున్సిపల్‌ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 22 మంది కౌన్సిలర్లు క్యాంపునకు తరలివెళ్లారు. మున్సిపాలిటీలో 26 వార్డులుండగా.. బల్దియా పీఠం ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ చేతిలో ఉన్నది. కానీ అదే పార్టీకి చెందిన నాయకుడే ప్రస్తుత చైర్‌పర్సన్‌ను గద్దె దింపాలని కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ బీఆర్‌ఎస్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. బీఆర్‌ఎ్‌సతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం కౌన్సిలర్లతో కలిసి ఆయన అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. ఆ నాయకుడు తన సతీమణిని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్థానంలో కూర్చోబెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తొలుత టీడీపీలో ఉన్న సదరు నేత అక్కడి నుంచి కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీల్లో కొనసాగి.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎ్‌సలో చేరడం గమనార్హం. కాంగ్రెస్‌ రాష్ట్రస్థాయి నేత ఆశీస్సులతోనే ఆయన ముందుకు వెళ్తున్నారని, అన్ని పార్టీల కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్‌గిరిని దక్కించుకున్న అనంతరం ఆయన కాంగ్రెస్‌ గూటికి చేరతారని ప్రచారం జరుగుతున్నది.

అగ్ర నాయకత్వంపైనే బీఆర్‌ఎస్‌ ఆశలు

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు క్యాంపునుకు వెళ్లడంపై ప్రస్తుత చైర్‌పర్సన్‌ వర్గం ఆగ్రహంతో ఉన్నది. పదవీకాంక్షతో పార్టీలన్నీ తిరుగుతున్న నేతకు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు మద్దతు తెలపడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో బీఆర్‌ఎ్‌సను గెలిపించుకున్నా బల్దియా పీఠం కోల్పోతుండడం విచారకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియా పీఠం చేజారకుండా రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. లేదంటే ఈ ప్రభావం పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలపై పడుతుందని హెచ్చరిస్తున్నారు.

పార్టీ పరువు తీయొద్దు : ఎమ్మెల్యే ‘చింతా‘

సంగారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 5: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీకి చెందిన బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. కౌన్సిలర్లు ఒక్కొక్కరితో ఆయన విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిసింది. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లపై అవిశ్వాసం పెడితే బీఆర్‌ఎ్‌సకు చెందినవారినే ఎన్నుకోవాలని ఆయన సూచించినట్టు సమాచారం పార్టీ పరువు తమ తీయవద్దని హితవు పలికినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ సమావేశానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ లతా విజయేందర్‌రెడ్డితో పాటు ఇద్దరు కౌన్సిలర్లు గైర్హాజరైనట్లు తెలిసింది.

వెనక్కి తగ్గిన పలువురు..

సంగారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస నోటీసులపై సంతకాల చేసిన కౌన్సిలర్లలో ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గుతున్నట్లు తెలిసింది. అవిశ్వాసంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, బీజేపీలకు చెందిన 22 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసిన విషయం తెలిసిందే. వీరిలో బీఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురు, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు యూటర్న్‌ తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - Feb 05 , 2024 | 11:58 PM