Share News

రూ.350 కోట్లతోనే సరి

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:43 PM

మనోహరాబాద్‌ కొత్తపల్లి రైల్వేలైను నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. 2016లో మొదలైన పనులు నేటికీ పూర్తికాలేదు. 151 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వేలైనులో ఇప్పటికీ సగం లైను మాత్రమే పూర్తయింది.

రూ.350 కోట్లతోనే సరి
మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైను నిర్మాణ పనులు (ఫైల్‌)

బడ్జెట్‌లో మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌కు నిధులు

ఇప్పటికే సిద్దిపేట వరకు 76కి.మీ.ల లైన్‌ పూర్తి

ఇంకా 75కి.మీ.ల పనులపై కసరత్తు

తాజా బడ్జెట్‌తో కొత్తపల్లి చేరడం కష్టమే

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఫిబ్రవరి 2: మనోహరాబాద్‌ కొత్తపల్లి రైల్వేలైను నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. 2016లో మొదలైన పనులు నేటికీ పూర్తికాలేదు. 151 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వేలైనులో ఇప్పటికీ సగం లైను మాత్రమే పూర్తయింది. కేంద్రం కొసిరికొసిరి నిధులు వడ్డిస్తుండడం కూడా జాప్యానికి కారణం. తాజా బడ్జెట్‌లో రూ.350 కోట్లు ఈ రైల్వేలైను నిర్మాణానికి కేటాయించడం శుభపరిణామమే అయినప్పటికీ ఈ నిధులతో కొత్తపల్లి దాకా చేరడం అసాధ్యంగా భావించాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది.

మెదక్‌ జిల్లాలోని మనోహరాబాద్‌ నుంచి సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల మీదుగా కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి వరకు చేపట్టిన రైల్వేలైను నిర్మాణానికి తాజా బడ్జెట్‌లో రూ.350 కోట్లు కేటాయించారు. 2016-17లో రూ.1,160 కోట్ల అంచనాతో ఈ లైనుకు శంకుస్థాపన చేశారు. ఇందులో మూడోవంతు వాటాతో పాటు ఉచితంగా భూసేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. ఇప్పటికే భూసేకరణ పూర్తయ్యింది. 151 కి.మీలలో 76 కి.మీల లైను ఏర్పాటు కావడంతోపాటు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు రైలు రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక సిద్దిపేట నుంచి కొత్తపల్లి వరకు 75కి.మీల లైను నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. ఇది పూర్తయితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.

70 గ్రామాలు.. 15 స్టేషన్లు

మెదక్‌, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల పరిధిలోని 70 గ్రామాల మీదుగా ఈ రైల్వేలైను నిర్మిస్తున్నారు. ఇప్పటికే వర్గల్‌ మండలం నాచారం, రాయపోల్‌ మండలం అప్పాయిపల్లి, బేగంపేట, గజ్వేల్‌ మండలం కొడకండ్ల, కొండపాక మండలం దుద్దెడ, సిద్దిపేట స్టేషన్ల నిర్మాణం పూర్తయింది. గజ్వేల్‌లో ఎరువుల దిగుమతి కోసం పాయింట్‌ను కూడా ఏర్పాటు చేశారు. కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ నిర్మాణంలోనూ స్పష్టత వచ్చింది. ఇక్కడ స్టేషన్‌ నిర్మాణానికి ఇటీవలే కేంద్రం నుంచి సంకేతాలు అందాయి. ఇక మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి వరకు 15 స్టేషన్లు ఉంటాయి. మెదక్‌ జిల్లాలో 9.30 కిలోమీటర్లు, సిద్దిపేట జిల్లాలో 83.40 కిలోమీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 37.80 కిలోమీటర్లు, కరీంనగర్‌ జిల్లాలో 20.86 కిలోమీటర్ల మేర ట్రాక్‌ నిర్మాణం ఉంటుంది. త్వరితగతిన నిధులు సమకూరితే వచ్చే రెండేళ్లలో కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి వరకూ ట్రాక్‌ పూర్తవడంతో పాటు రైళ్ల రాకపోకలు కొనసాగుతాయి. అంతేకాకుండా ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని అనుసంధానించేలా ఈ రైల్వేలైను నిర్మాణం ఉండబోతుంది.

నేటికీ ఒక్కటే రైలు

గత అక్టోబరు 3 నుంచి సిద్దిపేట-సికింద్రాబాద్‌ నడుమ రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. నిత్యం సిద్దిపేట నుంచి రెండుసార్లు రైలు బయల్దేరుతుంది. అయితే సిద్దిపేట నుంచి తిరుపతి, మైసూరు, బెంగళూరుకు రైలు సర్వీసులు నడిపిస్తారని అప్పట్లో చర్చ జరిగింది. కానీ నేటికీ ఒక్క రైలుతోనే సరిపెడుతున్నారు. ఈ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో తిరుపతికి వెళ్తుంటారు. వీరంతా సికింద్రాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ రైల్వేస్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడి నుండే నేరుగా తిరుపతికి రైలు సౌకర్యాన్ని కల్పించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. రైలు సర్వీసు ప్రారంభించి దాదాపు 4 నెలలు పూర్తయినందున ఎక్స్‌ప్రెస్‌ రైలు సౌకర్యాన్ని ఈ మార్గంలో ఏర్పాటు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Feb 02 , 2024 | 11:45 PM