Share News

తాగునీటి ఎద్దడి నివారణకు రూ.2.50 కోట్లు: ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:47 PM

నారాయణఖేడ్‌, ఏప్రిల్‌ 6: ఖేడ్‌ నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ప్రభుత్వం రూ.2.50 కోట్లను కేటాయించినట్లు ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు.

తాగునీటి ఎద్దడి నివారణకు రూ.2.50 కోట్లు: ఎమ్మెల్యే
ఖేడ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్‌, ఏప్రిల్‌ 6: ఖేడ్‌ నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ప్రభుత్వం రూ.2.50 కోట్లను కేటాయించినట్లు ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం పేరిట అప్పటికే ఉన్న ప్రత్యామ్నాయ నీటి వనరులను నిర్లక్ష్యం చేసిందన్నారు. గత వర్షాకాలంలో తక్కువ వర్షాపాతంతో పాటు ప్రస్తుత వేసవిలో ఎండల తీవ్రత బాగా పెరగడంతో భూగర్భజలాలు వేగంగా అడుగంటుతున్నాయన్నారు. ముందు జాగ్రత్త చర్యగా పాత పైప్‌లైన్లకు మరమ్మతులు చేయించామని పేర్కొన్నారు. బోరంచ, గూడురు పాతనీటి పథకాలకు మరమ్మతులు చేయించి నీటి సరఫరాకు సిద్ధం చేసి ఉంచామన్నారు. శాపూర్‌లో నిరుపయోగంగా ఉన్న ఫిల్టర్‌ బెడ్లకు మరమ్మతులు చేయిస్తే 22 గ్రామాలకు, 24 గంటలు నీటిని సరఫరా చేసే అవకాశం ఉన్నందున మరమ్మతులకు రూ.22 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ఎన్నికల కోడ్‌ కారణంగా నిధులు మంజూరు కాలేదని తెలిపారు. గొర్రెకల్‌లో ఖేడ్‌ వైపు నీటి సరఫరాకు సంబంధించి లో ఓల్టేజీ సమస్య ఉండగా.. మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పరిష్కారానికి ప్రతిపాదనలు పంపారన్నారు. అవసరమైతే నెలకు రూ.6 వేల చొప్పున చెల్లిస్తూ ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని నీటి సమస్య లేకుండా చూసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దారం శంకర్‌, బంజారా సేవాలాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమే్‌షచౌహాన్‌, న్యాయవాది సంగన్న పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:47 PM