Share News

మిల్లర్లపై ఆర్‌ఆర్‌ యాక్ట్‌?

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:52 AM

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) అందించడంలో మెదక్‌ మిల్లర్లు అధికారుల హెచ్చరికలను ఖాతరు చేయలేదు.

మిల్లర్లపై ఆర్‌ఆర్‌ యాక్ట్‌?

కస్టమ్‌ మిల్లింగ్‌లో జాప్యం

బకాయిలు రూ.645 కోట్లు

45 రైస్‌మిల్లులపై కేసులకు సిద్ధం

ఇప్పటికే కొన్ని మిల్లుల ఆస్తుల వేలంనకు ప్రకటన

మెదక్‌, జనవరి 31 : కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) అందించడంలో మెదక్‌ మిల్లర్లు అధికారుల హెచ్చరికలను ఖాతరు చేయలేదు. గడువులోగా బియ్యం ఇవ్వాలని అధికారులు పలుసార్లు హుకుం జారీ చేసినా మిల్లర్లు పెడచెవిన పెట్టారు. గడువు ముగిసినా లక్ష్యాన్ని చేరుకోని మిల్లర్లపై జరిమానాలు విధించడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. జిల్లాలో సుమారు రూ.645 కోట్ల విలువ చేసే బియ్యం రైస్‌ మిల్లర్ల వద్దే ఉండిపోయింది. ధాన్యం పక్కదారి పట్టించిన వారిపై క్రిమినల్‌ కేసులతో పాటు రెవెన్యూ రీకవరీ (ఆర్‌ఆర్‌) యాక్ట్‌ ప్రయోగించనున్నారు. ధాన్యాన్ని మిల్లింగ్‌ కోసం తీసుకుని బదులుగా బియ్యం ఇవ్వని మిల్లర్లపై ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ప్రకారం ఎందుకు ఆస్తులు జప్తు చేయకూడదని అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆరు రైస్‌మిల్లుల యజమాని ఆస్తులు బహిరంగ వేలం వేస్తున్నట్లు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా ప్రకటించారు.

1.87లక్షల మెట్రిక్‌ టన్నులు ఇవ్వాలి

జిల్లాలో పౌరసరఫరాల శాఖ 2022-23 యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించి 6,86,541 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రొక్యూర్‌ చేసి మిల్లులకు పంపించింది. ఇందులో యాసంగి సీజన్‌ 2,99,858మెట్రిక్‌ టన్నులు, వానాకాలంసీజన్‌ 3,86,683 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం జిల్లాలోని 160 రైస్‌మిల్లులకు పౌర సరఫరాల శాఖ కేటాయించింది. మిల్లింగ్‌ చేసిన తర్వాత 68 శాతం బాయిల్డ్‌ రైస్‌, 67 శాతం రా రైస్‌ ఫుడ్‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌ఫసీఐ)కి ఇవ్వాలి. అయితే యాసంగి సీజన్‌ బియ్యం 36,718 మెట్రిక్‌ టన్నులే వచ్చాయి. అదేవిధంగా వానాకాలం సీజన్‌కు సంబంధించి 2,27,594 మెట్రిక్‌ టన్నులు ఇచ్చారు. రెండు సీజన్లకు కలిపి ఇంకా 1,87,148 మెట్రిక్‌ టన్నుల బియ్యం జనవరి 31 కల్లా పౌరసరఫరాల శాఖకు ఇవ్వాలి. అయితే జిల్లాలో ఇంకా 45 మిల్లులు బియ్యం అందించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ రైస్‌మిల్లులకు 2023-24 సంవత్సరానికి సంబంధించి సీఎంఆర్‌ కోటా నిలిపి వేశారు.

Updated Date - Feb 01 , 2024 | 12:52 AM