Share News

మెదక్‌ జిల్లా గులాబీ అడ్డా

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:43 PM

రేవంత్‌రెడ్డికి అభివృద్ధి గురించి ఏం తెలుసు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి చూపించాలి ఆరు గ్యారంటీలు కావాలంటే కాంగ్రెస్‌ను ఓడించండి మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయం మెదక్‌ రోడ్‌షోలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

మెదక్‌ జిల్లా గులాబీ అడ్డా
మెదక్‌లోని శివాజీచౌక్‌ వద్ద రోడ్‌షోలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు

మెదక్‌ మున్సిపాలిటీ, ఏప్రిల్‌ 25: మెదక్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ అడ్డా అని, మెదక్‌ అభివృద్ధి గురించి సీఎం రేవంత్‌రెడ్డికి ఏం తెలుసునని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే బీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటు వేసి గెలిపించి, కాంగ్రె్‌సకు బుద్ధిచెప్పాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి గురువారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో మెదక్‌ పట్టణంలో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. స్థానిక స్టేడియం నుంచి భారీ ర్యాలీగా వచ్చి శివాజీచౌక్‌ వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు కాబట్టే ఇక్కడ నామినేషన్‌ వేసిన విషయాన్ని గుర్తెరగాలన్నారు. రేవంత్‌ సర్కార్‌ జిల్లాలను కుదించే కుట్రపన్నుతున్నదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీల్లో ఏ ఒక్కటైనా అమలుకాలేదన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పేగులు మెడలేసుకుంటానని మాట్లాడడం తగునా అని నిలదీశారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలపై ఇచ్చిన బాండ్‌పేపర్‌ విలువ తీసేశారని చెప్పారు. ఇప్పటి వరకు లక్ష పెండ్లిళ్లు రాష్ట్రంలో అయితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వారికి రూ.లక్షతో తులాల బంగారం బాకీపడిందన్నారు.

తన ఎత్తు గురించి మాట్లాడేకంటే కల్లాల్లో వడ్లను కొనుగోలు చేసేలా చూడాలని హరీశ్‌రావు హితవు పలికారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 280 మంది రైతులు, 38 మంది ఆశా కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వం తరఫున కనీసం వారి కుటుంబాలను పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. ఢిల్లీకి వెళ్లే సమయున్న ముఖ్యమంత్రికి బాధిత కుటుంబాలను పరామర్శించే సమయం దొరకడం లేదా ప్రశ్నించారు.

ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీని అమలుచేస్తే తాను రాజీనామాకు సిద్ధమని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి రేవరెంత్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ విషయంలో శుక్రవారం తాను గన్‌పార్కు వద్దకు రాజీనామా లేఖతో వస్తానని.. రేవంత్‌రెడ్డి కూడా రాజీనామా లేఖతో రావాలని సవాల్‌ విసిరారు. అమలు నిజమైతే తన రాజీనామా లేఖను మేధావులు స్పీకర్‌కు ఇస్తారని, అమలు కాకుంటే రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేయడానికి సిద్ధమా అని ప్రశ్నిచారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే కొత్త జిల్లాలు పోయినట్లేనని విమర్శించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు మంజీర నదిపై చెక్‌ డ్యాంల నిర్మాణం, వైద్య కళాశాలలు, రైల్వేలైన్‌కు రూ.100 కోట్లు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్లు వేసినంత మాత్రాన ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని హరీశ్‌రావు అన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మెదక్‌ కలెక్టర్‌గా పనిచేశారని, విజ్ఞనవంతుడైన వెంకట్రామారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ.. అధికారిగా పనిచేసిన తనకు ఇక్కడే మళ్లీ ప్రజాసేవ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. తాను గెలిస్తే నిరుపేదలకు ఉచింతగా ఫంక్షన్‌హాళ్లు నిర్మిస్తానని, రూ.100 కోట్లతో ట్రస్ట్‌ నిధిని ఏర్పాటు చేసి, సేవలందిస్తానని హామీ ఇచ్చారు. అబద్ధాలు, మోసపూరిత హామీలివ్వడం తనవల్ల సాధ్యం కాదన్నారు. అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటెయ్యాలని ఓటర్లను కోరారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి రోడ్‌షోకు అధ్యక్షత వహించగా జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సునితాలక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్‌, ఎమ్మెల్సీలు శేరిసుభా్‌షరెడ్డి, యాదవరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌, నాయకులు దేవేందర్‌రెడ్డి, బట్టి జగపతి, ఒంటేరు ప్రతా్‌పరెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మల్లిఖార్జున్‌గౌడ్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:43 PM