Share News

సంగారెడ్డి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను, నల్లా బిల్లు బకాయిలు రూ. 17.40 కోట్లు

ABN , Publish Date - Jan 14 , 2024 | 12:53 AM

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను, నల్లా బిల్లు బకాయిలు పేరుకుపోయాయి.

సంగారెడ్డి మున్సిపాలిటీలో   ఆస్తి పన్ను, నల్లా బిల్లు బకాయిలు రూ. 17.40 కోట్లు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జనవరి 13 : జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను, నల్లా బిల్లు బకాయిలు పేరుకుపోయాయి. మున్సిపల్‌ సిబ్బంది వసూళ్లపై దృష్టిసారించకపోవడంతో బకాయిలు కోట్లకు చేరుకున్నాయి. బల్దియా ఆర్థిక పరిస్థితి కుదేలవడతో మున్సిపల్‌ కమిషనర్‌ బకాయిల వసూళ్లపై దృష్టిసారించారు. ఇందుకోసం ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో 10 మంది బిల్‌ కలెక్టర్లను నియమించారు.

ఆస్తి పన్ను రూ. 8 కోట్లు, నల్లా బిల్లు రూ. 9.4 కోట్లు

సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలు రూ.8 కోట్లు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ఏప్రిల్‌, మే నెలలో ఆస్తి పన్ను చెల్లిస్తే ప్రభుత్వం 5 శాతం రిబేట్‌ ఇస్తున్నది. అయినా సంగారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాలవారు చెల్లించడం లేదు. వారి నుంచి తప్పనిసరిగా పన్ను వసూలు చేయాలని కమిషనర్‌ సుజాత బిల్‌ కలెక్టర్లను ఆదేశించారు. అలాగే నల్లా బిల్లు బకాయలు రూ.9.40 కోట్లు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీ పరిధిలో 12 వేల నల్లా కనెక్షన్లున్నాయి. ఒక్కో కనెక్షన్‌కు ఇంటి యజమాని నెలకు రూ.150 చొప్పున చెల్లించాలి. నల్లా బిల్లు వసూళ్లకు మున్సిపల్‌ సిబ్బంది రాకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో నాలుగైదు సంవత్సరాలుగా చెల్లించలేదు. కమిషనర్‌ ఆదేశాలమేరకు బిల్‌ కలెక్టర్లు రెండు మూడు రోజులుగా తమకు కేటాయించిన ప్రాంతాలలో తిరుగుతున్నారు. ఒక్కో బిల్‌ కలెక్టర్‌కు ప్రస్తుతానికి మూడు, నాలుగు వార్డుల చొప్పున కేటాయించారు. సంగారెడ్డి పాత పట్టణ పరిధిలో నల్లా బిల్లు చెల్లించడానికి ముందుకురానివారి కనెక్షన్‌ను సిబ్బంది తొలగిస్తున్నారు. బిల్లు చెల్లించని తర్వాతే కనెక్షన్లను పునరుద్దరిస్తున్నారు.

టార్గెట్‌ రూ. 30 వేలు

ప్రతీ బిల్‌ కలెక్టర్‌ ఒకరోజు రూ.30 వేల బకాయిలు వసూలు చేయాలని అధికారులు టార్గెట్‌ విధించినట్టు తెలిసింది. బకాయిలను వసూలు చేస్తేనే జీతాలు చెల్లిస్తామని షరతు విధించడం గమనార్హం. మరోవైపు టౌన్‌ లెవల్‌ ఫెడరేషన్‌(టీఎల్‌ఎ్‌ఫ) ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న 102 మంది సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదని తెలిసింది. బకాయిలు వసూలైతేనే సిబ్బందికి రెగ్యులర్‌గా జీతాలు ఇచ్చే వీలున్నదని అధికార వర్గాలు తెలిపాయి. సంక్రాంతి పండుగ ఉన్నా తమకు జీతాలు చెల్లంచకపోవడంపై ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 14 , 2024 | 12:56 AM