Share News

ధర లేక ‘చింత’

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:47 PM

చింతపండుకు ఈ ఏడాది గిట్టుబాటు ధర దక్కడం లేదు. గతేడాది మంచి ధర పలకగా.. ఈ సారి ధరలేక రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని గ్రామాల్లో చింత పండు సేకరణ ఓ ఉపాధిగా భావిస్తారు.

ధర లేక ‘చింత’

మార్కెట్‌లో డిమాండ్‌ లేక దిగాలు

ఈ ఏడాది సగానికిపైగా తగ్గిన ధర

గతేడాది క్వింటాలు రూ. 21వేలు

ఈ ఏడాది రూ.6వేల నుంచి రూ. 10 వేలు

దుబ్బాక, ఏప్రిల్‌ 15: చింతపండుకు ఈ ఏడాది గిట్టుబాటు ధర దక్కడం లేదు. గతేడాది మంచి ధర పలకగా.. ఈ సారి ధరలేక రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని గ్రామాల్లో చింత పండు సేకరణ ఓ ఉపాధిగా భావిస్తారు. వేలాది క్వింటాళ్లను సేకరించి, మార్కెట్‌కు తరలిస్తారు. జిల్లాలోని దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్‌, రాయపోల్‌, తొగుట, చిన్నకోడూరు, మల్యాలతోపాటు పలు మండలాల్లోని గ్రామాల నుంచి చింతపండును సేకరించి, హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌కు తరలిస్తారు. అక్కడ చింతపండు నాణ్యతను పరిశీలించి వేలం ద్వారా ధర నిర్ణయిస్తారు. అయితే, మార్కెట్‌లో ధర లేకపోవడంతో వ్యాపారులకు చింతపండు ఈ ఏడాది నష్టాన్నే మిగులుస్తోంది.

గ్రామాల్లో చింత చెట్టు ఒక్క దానిని రైతుల నుంచి ముందుగానే మారు బేరగాళ్లు రూ. 7వేల నుంచి రూ. 20 వేలకు గుత్తకు తీసుకుంటారు. ఒక్కో చెట్టుకు క్వింటా నుంచి మూడు క్వింటాల వరకు గింజ కాయ వస్తుంది. చెట్టు నుంచి కాయ తెంపేందుకు (మగవాళ్లకు) సుమారు రూ. 1200, కింద పడ్డ గింజ వేరు చేయడానికి (ఆడవారికి) రూ. 400 కూలీ చెల్లిస్తారు. ఇంటికి తీసుకువచ్చి గింజను వేరు చేయడానికి గంపకు రూ. 250 కూలీగా చెల్లిస్తారు. మొత్తంగా క్వింటా చింతపండు మార్కెట్‌కు తరలించే వరకు రూ. 8 వేల నుంచి రూ. 11 వేల వరకు ఖర్చు (రైతుకు ఇచ్చే డబ్బు కలిపి) అవుతుంది. ప్రస్తుతం సరుకును హైదరాబాద్‌ మార్కెట్‌కు తీసుకువస్తుండగా, క్వింటా కేవలం రూ. 6 వేల నుంచి రూ. 10 వేల వరకు మాత్రమే ధర పలుకుతుండటంతో చెట్లు గుత్తకు తీసుకున్న వ్యాపారులు దిగాలు చెందుతున్నారు.

గతేడాది లాభం చూసి..

గతేడాది చింత పండుకు మార్కెట్‌లో మంచి ధర పలికింది. క్వింటా రూ. 21 వేల నుంచి రూ. 22 వేల వరకు ధర పలకడంతో ఈసారి పోటీ పడి మరీ చెట్లను గుత్తకు తీసుకున్నారు. గతేడాది లాభం రావడంతో ఈసారీ నాలుగు పైసలు మిగులుతాయని భావించిన వారికి మార్కెట్‌లో ధరలు చేదు అనుభవాన్ని మిగులుస్తున్నాయి. గతేడాది చింతపండుకు గిరాకీ ఉండగా, అప్పట్లో కొనుగోలు చేసిన బడా వ్యాపారులు చింతపండును కోల్డ్‌ స్టోరేజీలో నిలువ ఉంచారు. అప్పటి నిల్వలు ఎక్కువగా ఉండటంతో ఈసారి కొత్త చింతపండుకు ధర పెట్టేందుకు వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ధరపై ప్రభావం పడినట్లు భావిస్తున్నారు. మార్కెట్‌లో ధర లేకపోవడంతో కొందరు వ్యాపారులు చెట్ల మీదే కాయలు వదిలేస్తున్నారు. దీంతో చాలా చోట్ల చింతపండు చెట్టుమీదనుంచే రాలి, పాడువుతుంది. ఇక కొందరు రైతుల నుంచి చింత చెట్లను గుత్తకు తీసుకుని కాయ అమ్మిన తర్వాత డబ్బులు చెల్లిస్తామని ఒప్పందం చేసుకుంటారు. ఈమేరకు కొంత బయానా చెల్లిస్తారు. అయితే, ధర లేకపోవడం, చెట్లమీదనే కాయలు వదిలేయడంతో పాటు చాలా మంది బయానా వదిలేసుకుని వెళ్తుండటంతో రైతులూ నష్టపోతున్నారు.

Updated Date - Apr 16 , 2024 | 08:12 AM