బదిలీలు, పదోన్నతులకు రంగం సిద్ధం
ABN , Publish Date - Jun 07 , 2024 | 10:53 PM
సంగారెడ్డి అర్బన్, జూన్ 7: వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలు, పదోన్నతులకు రంగం సిద్ధమైందా అంటే.. అవుననే సమాధానం ఆ వర్గాల్లో వినిపిస్తున్నది.

డీహెచ్, డీఎంఈ, టీవీవీపీ అధికారులు, ఉద్యోగులకు స్థానచలనం
సాధారణ బదిలీలు, పదోన్నతులపై త్వరలో వెలువడనున్న జీవో
ఇప్పటికే ఆయా విభాగాల హెచ్‌వోడీలు వివరాలు సేకరణ
సంగారెడ్డి అర్బన్, జూన్ 7: వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలు, పదోన్నతులకు రంగం సిద్ధమైందా అంటే.. అవుననే సమాధానం ఆ వర్గాల్లో వినిపిస్తున్నది. ఎన్నికల కోడ్ ముగియగానే సాధారణ బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన జీవో త్వరలో వెలువడనున్నదని తెలుస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీహెచ్), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ)విభాగాల్లో పనిచేసే జిల్లా వైద్యాధికారులు, వైద్యాధికారులు, ఉద్యోగులు, వైద్య సిబ్బందికి స్థాన చలనం కలగనున్నది. ఇప్పటికే ఆయా విభాగాల హెచ్‌వోడీలు అధికారులు, ఉద్యోగుల వివరాలు సేకరించారు. బదిలీలు, పదోన్నతుల భాగంగా సంగారెడ్డి జిల్లాకు కొత్త వైద్యాధికారులు వచ్చే అవకాశం ఉంది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(డీహెచ్) పరిధిలోని వస్తే మూడేళ్లుగా ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా డా.గాయత్రీదేవీ కొనసాగుతున్నారు. 3.4.2021న రెగ్యులర్ డీఎంహెచ్‌వోగా డా.లక్ష్మణ్‌సింగ్‌ను ప్రభుత్వం నియమించినా ఆయనకు చార్జీ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం నిరాకరించింది. దీంతో డా.గాయత్రీదేవే అప్పటి నుంచి ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా కొనసాగుతున్నారు. గతంలో బీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా వ్యవహరించడం, ఇతరత్రా ఆరోపణల నేపథ్యంలో గత మార్చిలోనే ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేట, మెదక్ జిల్లాల డీఎంహెచ్‌వోలను ఒకరోజు వ్యవధిలోనే ప్రభుత్వం బదిలీచేసింది. ఆ క్రమంలో సంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వోను కూడా మార్పుచేసి సీనియర్‌ను డీఎంహెచ్‌వో నియమిస్తారన్న ప్రచారం కూడా జోరుగా జరిగింది. ఇక డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు అనుబంధ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్లు కొత్తవారు వచ్చే అవకాశం ఉంది. అదనపు డీఎంఈ హోదా ఉన్నవారే ఆ పోస్టుకు అర్హులు, కాగా ప్రస్తుతం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సుధామాధురి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.అనిల్‌కుమార్ ఇద్దరూ ఇన్‌చార్జిలుగా కొనసాగుతున్నారు. వారి స్థానంలో కొత్తవారు రానున్నారని తెలుస్తోంది. వైద్య విధాన పరిషత్ పరిధిలో కొన్నేళ్లుగా డీసీహెచ్‌ఎ్‌సగా పనిచేస్తున్న డా.సంగారెడ్డికి కూడా స్థాన చలనం తప్పనిసరి అని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.