Share News

గ్రామాల్లో ప్లాస్టిక్‌ను నియంత్రించాలి

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:52 PM

హుస్నాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 7: గ్రామాల్లో ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు మహిళలు కంకణబద్దులు కావాలని సిద్దిపేట అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ అన్నారు.

గ్రామాల్లో ప్లాస్టిక్‌ను నియంత్రించాలి
హుస్నాబాద్‌ మండలం నాగారంలో పారిశుధ్యంపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌

‘పది’లో వందశాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు కృషి చేయాలి

సిద్దిపేట అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌

హుస్నాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 7: గ్రామాల్లో ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు మహిళలు కంకణబద్దులు కావాలని సిద్దిపేట అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ అన్నారు. బుధవారం హుస్నాబాద్‌ మండలం నాగారం, మహ్మదాపూర్‌ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామాలను సందర్శించారు. ఈ సందర్బంగా పంచాయతీల్లోని మురుగు కాలువలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలను సందర్శించారు. గ్రామాల్లో ఎక్కడా ప్లాస్టిక్‌ కవర్లు, ప్లేట్స్‌ దర్శనం ఇవ్వకుండా వాటి వాడకాన్ని సమూలంగా తగ్గించాలన్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు, జాతరకు వెళ్తున్న సమయాల్లో ప్లాస్టిక్‌ గ్లాసులు, ప్లేట్లు వాడకుండా స్టీల్‌ బ్యాంకు ద్వారా స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులు తీసుకుని ఉపయోగించాలని ప్రజలకు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారంపై గర్భిణులకు, బాలింతలకు అవగాహన పెంపొందించాలన్నారు. గ్రామాల్లోని నర్సరీల పెంపకంలో అశ్రద్ధ చేయొద్దని పేర్కొన్నారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా పాలనాధికారులు దృష్టిపెట్టాలని సూచించారు. వాటర్‌ ట్యాంకులను పరిశుభ్రం చేయాలని వాటర్‌మెన్‌లను ఆదేశించారు. డంపింగ్‌యార్డుల ద్వారా వర్మీ కంపోస్టు ఎరువులు తయారు చేసి పంట పొలాలకు వాడుకోవాలని పేర్కొన్నారు. ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌షెడ్ల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో బాలిక ఆరోగ్యం పట్ల పరీక్షలు చేపట్టాలని ఆరోగ్యి సబ్బందిని ఆదేశించారు.

విద్యార్థులకు పాఠాలు బోధించిన అదనపు కలెక్టర్‌

పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతుల నిర్వహణ చేపట్టాలని అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహ్మదాపూర్‌ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఎంతమంది 10 జీపీఏ సాధిస్తారనే నమ్మకం ఉందో చేతులు ఎత్తి చూపాలన్నారు. నిత్యం పాఠాశాలకు హాజరుకావాలని, శ్రద్ధతో చదివి లక్ష్యం చేరుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీల రికార్డులను పరిశీలించి పంచాయతీ నిధుల నిల్వలు, ఉపాధి పనులపై కార్యదర్శులను ఆరాతీశారు. ఆమె వెంట ఎంపీపీ లకావత్‌ మానస, జిల్లా పంచాయతీ అధికారి బి.దేవకి, బీసీ వెల్ఫేర్‌ అధికారి సరోజన, ఎంపీడీవో రాఘవేందర్‌రెడ్డి, ఎంపీపీ సత్యనారాయణ,ఏపీఎం శ్రీనివాస్‌, ఎంపీటీసీ పిట్టల శ్రావణి, తాజా, మాజీ సర్పంచులు బత్తుల సుగుణ, సంపత్‌, కార్యదర్శులు ఉన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:52 PM