Share News

ప్లాస్టిక్‌ నియంత్రణ ప్రకటనలకే పరిమితం

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:23 PM

సంగారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 20: పట్టణాల్లో ప్లాస్టిక్‌ నియంత్రణ కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించాలని పురపాలక శాఖ ఇచ్చిన ఆదేశాలను ఆశాఖ అధికారులు బేఖాతర్‌ చేస్తున్నారు.

ప్లాస్టిక్‌ నియంత్రణ ప్రకటనలకే పరిమితం
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌లో రోడ్డు పక్కన పేరుకుపోయిన ప్లాస్టిక్‌ కవర్లు

బల్దియాలో విచ్చలవిడిగా వినియోగం

పురపాలక శాఖ ఆదేశాలు బేఖాతర్‌

సంగారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 20: పట్టణాల్లో ప్లాస్టిక్‌ నియంత్రణ కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించాలని పురపాలక శాఖ ఇచ్చిన ఆదేశాలను ఆశాఖ అధికారులు బేఖాతర్‌ చేస్తున్నారు. 2022 జూలై 1 నుంచి ప్లాస్టిక్‌ నిషేధంపై కొత్త నిబంధనలు వచ్చినప్పటికీ, పట్టణాల్లో అమలు జరగడం లేదు. మునిసిపల్‌ అధికారులు వ్యాపార, వాణిజ్య కేంద్రాలపై దాడులు చేస్తూ నామమాత్రపు జరిమానాలు వేస్తూ చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలొస్తున్నాయి.

నామమాత్రంగా తనిఖీలు

సంగారెడ్డి జిల్లా ఆయా పట్టణాల్లోని దుకాణాలు, వ్యాపార కేంద్రాలు, స్వీట్‌ షాపులు ప్లాస్టిక్‌ కవర్లను బహిరంగంగానే విక్రయిస్తున్నాయి. వీటిని అదుపు చేయడంలో పురపాలకశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోలు-జోగిపేట, సదాశివపేట, అమీన్‌పూర్‌, బొల్లారం, తెల్లాపూర్‌ బల్దియాల పరిధిలో ఎక్కువగా పాలిథిన్‌ కవర్లను వినియోగిస్తున్నారు. అధికారులు మాత్రం అప్పుడప్పుడూ చిన్నచిన్న దుకాణాలపై దాడులు చేసి, జరిమానాలు విధిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. పాలిథిన్‌ను విక్రయించే పెద్ద దుకాణాల వైపు కన్నెత్తి చూడటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2022 జూలై 1 నుంచి నిషేధిత పాలిథిన్‌ వస్తువుల జాబితాను పురపాలక శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో సెప్టెంబరు నుంచి 75 మైక్రాన్లు, డిసెంబరు 31 నుంచి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్నవాటిపై నిషేధం విధించారు.

పురపాలికల్లో రోజువారీగా పాలిథిన్‌ వినియోగం

సంగారెడ్డి జిల్లాలోని ఆయా మునిసిపాలిటీల్లో పాలిథిన్‌ వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్నది. సంగారెడ్డి గ్రేడ్‌ వన్‌ మునిసిపాలిటీ పరిధిలో రోజుకు సరాసరిగా 18 టన్నులు, జహీరాబాద్‌ పట్టణంలో 10 టన్నులు, సదాశివపేటలో 16 టన్నులు, అందోలు-జోగిపేటలో 5 టన్నులు, నారాయణఖేడ్‌లో 4 టన్నులు, అమీన్‌పూర్‌లో 14 టన్నులు, తెల్లాపూర్‌లో 6 టన్నులు, బొల్లారంలో 7 టన్నుల పాలీథీన్‌ను వినియోగిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. పట్టణాల్లో పాలిథిన్‌ నిషేధంపై పురపాలక శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి.

ప్రత్యేక అధికారిని నియమించినా..

ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రతీ మునిసిపాలిటీలో ప్రత్యేకంగా పర్యావరణ ఇంజనీర్‌ను నియమించారు. వీరు పాలిథిన్‌ కవర్లను వినియోగించవద్దంటూ ప్రజలకు అవగాహన కల్పించాలి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధ్వర్యంలో పట్టణాల్లో, డీఆర్‌డీఏ అధ్వర్యంలో గ్రామాల్లో మహిళా సంఘాలు ఉన్నాయి. పాలిథిన్‌ కవర్ల వాడకుండా ఉండేందుకు సబ్సిడీపై రుణాలు ఇచ్చి జ్యూట్‌, వస్త్రం బస్తాలను చేసేలా శిక్షణ ఇస్తే, ఉపాధితో పాటు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సంగారెడ్డి పట్టణంలో దీనిపై ప్రయత్నాలు చేసినప్పటికీ, నిర్లక్ష్యం కారణంగా అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా మునిసిపల్‌ అధికారులు ప్లాస్టిక్‌ నిషేధంపై దృష్టి సారించి, పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:23 PM