Share News

‘ఖేడ్‌’లో ఫార్మా విలేజ్‌

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:08 AM

ఉపాధి కల్పన కోసం నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటలో ఖేడ్‌ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జన జాతర సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

‘ఖేడ్‌’లో ఫార్మా విలేజ్‌

విద్య, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం

ఇచ్చిన మాట నిలుపుకోవడం కాంగ్రెస్‌ నైజం

ఐదు గ్యారెంటీలు అమలు చేశాం

ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి

నారాయణఖేడ్‌, ఏప్రిల్‌ 26 : ఉపాధి కల్పన కోసం నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటలో ఖేడ్‌ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జన జాతర సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య, ఉద్యోగాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. ఖేడ్‌ నియోజకవర్గంలో 2వేల ఎకరాల భూమిని సేకరించి ఇస్తే నెల రోజుల్లోనే ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ ఇచ్చిన మాట నిలుపుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు, గడీల పాలనను అంతమొందించడానికే ప్రజలు కాంగ్రె్‌సకు పట్టం కట్టారని చెప్పారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో నలుగురు ఎమ్మెల్యేను గెలిపించి, రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి సహకరించడంతోనే తాను సీఎంగా ప్రజల ముందు మాట్లాడగలుగుతున్నానని అన్నారు. ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తున్న కాంగ్రె్‌సనే లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఎల్‌బీ స్టేడియంలో 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని గుర్తుచేశారు. సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. నీళ్లు, నిధులు, నియమకాల పేరిట అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. తన కుటుంబ సభ్యులకు, బంధువులకే ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. కాంగ్రెస్‌ జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ ఎమ్మెల్యేగా, ఎంపీగా ఈప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోఽధుల కుటుంబంలో మూడోతరంలో సురే్‌షషెట్కార్‌ ప్రజలకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. చిన్న పదవులనే వదులకోని కాలంలో తనకు వచ్చిన ఎమ్మెల్యే టికెట్‌ను ఆయన సంజీవరెడ్డికి ఇప్పించి స్నేహాన్ని చాటుకున్నారని అన్నారు. ఆయన త్యాగాన్ని గుర్తించి ఈ ఎన్నికల్లో ఆయనను లక్ష మెజారీటీతో ఎంపీగా గెలిపించాలని కోరారు.

మహిళా ఐటీఐ ఏర్పాటు చేస్తాం..

నారాయణఖేడ్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినందుకు సీఎం అభినందించారు. ఈ ప్రాంత విద్యార్థుల కోసం 24/7 పనిచేసేలా లైబ్రరీని నిర్మించడానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మహిళల ఐటీఐని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

రిజర్వేషన్ల రద్దుకు నరేంద్రమోదీ కుట్ర..!

రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కుట్ర చేస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆరోపించారు. జనజాతర బహిరంగ సభలో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. రిజర్వేషన్ల కారణంగానే తాను ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం మంత్రిగా కాగలిగానని అన్నారు. మనమందరం అప్రమత్తంగా ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ రూ. 7.50 లక్షల కోట్లు అప్పులు చేశారని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు విమర్శించారు. రైతుబంధు కోసం రూ. 7వేల కోట్లు విడుదల చేశామని బీఆర్‌ఎస్‌ చెప్పడం అబద్దమని, దమ్ముంటే ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కొడంగల్‌ మాదిరిగా అభివృద్ధి చేయండి

ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ నారాయణఖేడ్‌ నియోజకవర్గాన్ని కొడంగల్‌ మాదిరిగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు 8 టీఎంసీల నీటిని కేటాయించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కారణంగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ పిట్టల దొరగా మారాడని, కేటీఆర్‌, హరీశ్‌రావులు రాజీనామా డ్రామాలతో తుపాకీ రాముళ్లులా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జహీరాబాద్‌ ఎంపీగా తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి గెలిపించాలని సురేష్‌ షెట్కార్‌ కోరారు. సంగారెడ్డి-ముంబై హైవే అభివృద్ధి చేయించామని, సంగారెడ్డి-అకోలా హైవే 161ను ఏర్పాటుకు జీవో తీసుకువచ్చానన్నారు. ఎల్లారెడ్డి, నారాయణఖేడ్‌లలో మోడల్‌ డిగ్రీ కళాశాలు, 15 మోడల్‌ స్కూళ్లు, జహీరాబాద్‌లో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయించానని చెప్పారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, జహీరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సురే్‌షషెట్కార్‌, ఎమ్మెల్యేలు పట్లోళ్ల సంజీవరెడ్డి, లక్ష్మీకాంతరావు, మదన్‌మోహన్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షబ్బీర్‌అలీ, మాజీ మంత్రులు మండవ వెంకటేశ్వర్‌రావు, చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌, మాజీ ఎమ్మెల్యేలు ఎనుగు రవీందర్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస శ్రీనివాస్‌, యూసు్‌ఫఅలీ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం

నారాయణఖేడ్‌/పెద్దశంకరంపేట/అల్లాదుర్గం, ఏప్రిల్‌ 26: నారాయణఖేడ్‌ నియోజకవర్గ పరిధిలోని పెద్దశంకరంపేటలో నిర్వహించిన జన జాతర సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సభకు నారాయణఖేడ్‌, జుక్కల్‌, ఎల్లారెడ్డి, అందోల్‌, జహీరాబాద్‌, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్‌ శ్రేణులు తరలివచ్చారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉన్నా మూడు గంటలు ఆలస్యమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెలిక్యాప్టర్‌లో 6.20కు పెద్దశంకరంపేటకు చేరుకున్నారు. సభావేదిక వద్దకు 7 గంటలకు చేరుకున్నారు. 8.30 గంటల వరకు సభ కొనసాగింది. సభ ఆలస్యమయినప్పటికీ కార్యకర్తలు నిరుత్సాహం చెందలేదు. టీపీసీసీ సభ్యులు శంకరయ్యస్వామి, శ్రీనివాస్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, నగేష్‌ షెట్కార్‌, నారాయణఖేడ్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌ స్వరూప్‌ షెట్కార్‌, వైస్‌ చైర్మన్‌ దారం శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:08 AM