Share News

పెండింగ్‌ వేతనాల కోసం పొగగొట్టంపైకి..

ABN , Publish Date - May 15 , 2024 | 11:37 PM

బిడ్డ పెళ్లి కోసం కార్మికుడి చర్య

పెండింగ్‌ వేతనాల కోసం పొగగొట్టంపైకి..

చెల్లిస్తేనే దిగివస్తానని మొండిపట్టు

అధికారుల హామీతో కిందికి..

జహీరాబాద్‌, మే 15: జహీరాబాద్‌ మండల పరిధి కొత్తూర్‌(బి) గ్రామంలోని ట్రైడెంట్‌ కర్మాగార యాజామాన్యం ఓ కార్మికుడు బుధవారం కర్మాగారం పొగగొట్టం ఎక్కి, పెండింగ్‌ వేతనం చెల్లిస్తేనే కిందికి దిగుతానని భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో అధికారులు, నేతలు వచ్చి బుధవారం రాత్రిలోగా వేతనం సమకూరుస్తామని చెప్పడంతో ఆందోళన విరమించి కిందికి దిగాడు.

వివరాల్లోకి వెళ్లితే.. ట్రైడెంట్‌ కర్మాగారంలో అల్గి రమే్‌షబాబుతో పాటు కార్మికులకు 12 నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. రమే్‌షబాబుకు సుమారు రూ.2లక్షల పైచిలుకు వేతనం రావాల్సి ఉంది. దీంతో ఆయన బుధవారం కర్మాగారం పొగగొట్టం ఎక్కారు. తన కూమార్తె వివాహం ఉందని, వెంటనే పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. తోటి కార్మికులు వెంటనే పోలీసులకు, ప్రజాప్రతినిధులకు, కార్మిక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ఫిలిం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గిరిధర్‌రెడ్డి, కార్మిక శాఖ డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రవీందర్‌, అసిస్టెంట్‌ లేబర్‌ అధికారి యాదయ్య, పట్టణ సీఐ రాజబోయిన రవి, చిరాగ్‌పల్లి ఎస్‌ఐ నరేష్‌, కార్మిక సంఘం నాయకుడు హుగ్గెల్లి రాములు తదితరులు వచ్చి పొగగొట్టం ఎక్కిన కార్మికుడిని కిందికి దింపేందుకు ప్రయత్నించారు. అయితే, తక్షణమే పెండింగ్‌ వేతనం చెల్లిస్తేనే దిగుతానని భీష్మించుకూర్చున్నాడు. రాష్ట్ర ఫిలిం డెవల్‌పమెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ గిరిధర్‌రెడ్డి వెంటనే పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ సైతం కర్మాగార యాజమాన్యంతో మాట్లాడారు. కార్మికులు అల్గి రమే్‌షబాబు, శేఖర్‌ల కుమార్తెల వివాహం ఉన్నందున వారికి బుధవారం రాత్రి వరకు వేతనాలు సమకూరుస్తామని, మిగిలిన కార్మికులకు బుధవారం సంగారెడ్డి కలెక్టర్‌ సమక్షంలో సమావేశం నిర్వహించి, వేతనాలు వచ్చేలా చూస్తామని చెప్పడంతో అల్గి రమే్‌షబాబు కిందికి దిగేందుకు అంగీకరించాడు. దీంతో అగ్నిమాపక శాఖ వారు కార్మికుడిని కిందికి దించారు.

Updated Date - May 15 , 2024 | 11:37 PM