Share News

బస్టాండ్‌ను ఆక్రమించి.. చలివేంద్రంగా మార్చి..!

ABN , Publish Date - May 23 , 2024 | 10:38 PM

సంగారెడ్డి రూరల్‌, మే 23: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉన్న బస్టాండ్‌ను అక్రమార్కులు చలివేంద్రంగా మార్చేశారు.

బస్టాండ్‌ను ఆక్రమించి.. చలివేంద్రంగా మార్చి..!
ఇస్మాయిల్‌ఖాన్‌పేట చౌరస్తాలోని బస్టాండ్‌ను చలివేంద్రంగా మార్చిన దృశ్యం

బస్టాండ్‌ లేక చెట్టునీడలో ప్రయాణికుల నిరీక్షణ

సంగారెడ్డి రూరల్‌, మే 23: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉన్న బస్టాండ్‌ను అక్రమార్కులు చలివేంద్రంగా మార్చేశారు. సంగారెడ్డికి వెళ్లేందుకు ఇస్మాయిల్‌ఖాన్‌పేట, గౌడిచర్ల, బ్యాతోల్‌, ఎర్దనూర్‌ గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వస్తారు. నర్సాపూర్‌ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తాయి. అయితే బస్టాండ్‌ నిర్మించిన కొత్తలో ప్రయాణికులు అందులోనే కూర్చుని బస్సుల కోసం నిరీక్షించేవారు. కొంతకాలం తరువాత కొందరు బస్టాండ్‌ను వేసవిలో చలివేంద్రంగా మార్చేశారు. ప్రస్తుతం ఎండాకాలం వెళ్లిపోయినా చలివేంద్రాన్ని తొలగించకుండా బస్టాండ్‌ చుట్టూ ఇనుప కడీలతో గోడ, తలుపులు నిర్మించి తాళాలు వేసి ఆక్రమించుకున్నారు. ప్రజావసరాల కోసం నిర్మించిన బస్టాండ్‌ను కొందరు చలివేంద్రం ఏర్పాటు చేసి పూర్తిగా స్వాధీనం చేసుకోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బస్సుల కోసం వేచిచూసేందుకు బస్టాండ్‌ లేక ప్రయాణికులు పక్కనే ఉన్న రాగి చెట్టు వద్ద బస్సు కోసం నిరీక్షిస్తున్నారు. చలివేంద్రాన్ని తొలగించి బస్టాండ్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - May 23 , 2024 | 10:38 PM