Share News

కాంగ్రెస్‌తో ఒరిగేదేమీ లేదు!

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:18 AM

- ఆరు గ్యారంటీలను, సంక్షేమ పథకాలను అమలు చేసే సత్తా వారికి లేదు

కాంగ్రెస్‌తో ఒరిగేదేమీ లేదు!

- లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ గెలిచి ఏం చేస్తాయ్‌ ?

- తూప్రాన్‌లో విజయ సంకల్ప యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

తూప్రాన్‌, ఫిబ్రవరి 25 : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీతో ఒరిగేదేమీ లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణంలో నిర్వహించిన విజయ సంకల్పయాత్రకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద ప్రసంగించారు. ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలను అమలు చేసే సత్తా కాంగ్రెస్‌ పార్టీకి లేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తరువాత రాహుల్‌గాంధీ దేశంలో ఏడాది పాటు కనిపించడన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని, వారు గెలిచినా లాభం లేదన్నారు. నరేంద్రమోదీని మరోసారి ఆశీర్వదించాలని, మెదక్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలు, మోసాలను తెలంగాణ బిడ్డలు భరించే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అవినీతి, కుటుంబ పార్టీలని ఆయన ఆరోపించారు. ఈ రెండు భవిష్యత్తులో కలిసే పార్టీలంటూ కిషన్‌రెడ్డి వాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ పార్టీని గద్దె దించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో 17 స్థానాలకు 17 స్థానాలు గెలుస్తామని, హైదరాబాద్‌లో ఎంఐఎంను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఽఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. అయితే తూప్రాన్‌లో విజయసంకల్ప యాత్రకు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నా ప్రజలు అంతంతమాత్రమే హాజరయ్యారు. భారీ ఎత్తున బైక్‌ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, సాధారణస్థాయులోనే కొనసాగింది. యాత్రలో ఉన్న జనాల కంటే పట్టణంలో రోడ్డుపై వెళ్లే ప్రజలే ఎక్కువగా కనిపించారు. కార్యక్రమానికి మీడియాను సైతం ఆహ్వానించకపోవడం గమనార్హం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బీజేపీ నాయకులే సభపై పెదవి విరిచారు.

బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నాయి

నర్సాపూర్‌, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఓర్వలేపోతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నర్సాపూర్‌లో రాష్ట్ర నాయకులు రాణిరుద్రమ, మురళీధర్‌యాదవ్‌, మెదక్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివా్‌సతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏ పార్టీ అధ్యక్షుడో తెలుసుకోవాలని హితవు పలికారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని, ఈ పార్టీకి ఇన్ని, ఆ పార్టీకి అన్ని అంటూ తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఓవైపు జాతీయ అధ్యక్షుడు నడ్డా పొత్తు ఉండదని స్పష్టం చేసినా తప్పుడు ప్రచారం చేస్తూ లబ్ధిపొందాలని చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోడ రాజేందర్‌, ఓబీసీ రాష్ట్రఅధికార ప్రతినిది పెద్దరమే్‌షగౌడ్‌, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు చిన్నరమే్‌షగౌడ్‌, కౌన్సిలర్లు బుచ్చే్‌సయాదవ్‌, యాదగిరి, సురేష్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చాకరిమెట్లలో పూజలు

శివ్వంపేట, ఫిబ్రవరి 25: బీజేపీ సంకల్పయాత్రలో భాగంగా యాత్ర ఆదివారం శివ్వంపేట మండలంలో ప్రవేశించింది. మండలంలోని చాకరిమెట్ల ఆంజనేయస్వామి ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మురళీధర్‌యాదవ్‌ తదితరులు సందర్శించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా యాత్ర చిన్నగొట్టిముక్లకు వచ్చాక స్థానిక సౌమ్యతండాలో కొద్దిసేపు ఆగి అక్కడ గిరిజనులు చేసిన రొట్టెలను తిని వారితో పాటు కాసేపు సంప్రదాయ గిరిజన నృత్యం చేసి అందరినీ అలరించారు.

Updated Date - Feb 26 , 2024 | 12:18 AM