Share News

ప్రజావాణి వినరా?

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:36 PM

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజావాణి’కి బ్రేక్‌ పడింది.

ప్రజావాణి వినరా?

సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో నిలిచిన ఫిర్యాదుల స్వీకరణ

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విరామం

జూన్‌ 6 వరకు ఉండదని ప్రకటన

అప్పటి వరకు ప్రజా సమస్యలు గాలికేనా?

మెదక్‌ జిల్లాలో కొనసాగింపు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మార్చి18: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజావాణి’కి బ్రేక్‌ పడింది. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ వెలువడిన నేపథ్యంలో నిలిపేస్తున్నామని సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే జూన్‌ 6 వరకు ఫిర్యాదుల స్వీకరణ ఉండదని వారు తెలిపారు. ప్రజావాణి లేదని తెలియక సోమవారం పెద్దసంఖ్యలో లబ్ధిదారులు సంగారెడ్డి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఫిర్యాదులు తీసుకోవడం లేదని తెలియడంతో నిరాశగా వెనుదిరిగారు. ఎన్నికల పేరిట దాదాపు రెండున్నర నెలల వరకు ప్రజావాణి నిలిపేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడానికే ఇంకో నెల సమయం ఉండడడంతో.. కనీసం అప్పటి వరకు ప్రజా సమస్యలు వింటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నాటి నుంచే కోడ్‌ అమలులోకి వచ్చినా ఎన్నికల సంఘం నిబంధనలమేరకు ఇప్పటికే జరుగుతున్న (ఆన్‌గోయింగ్‌) ప్రభుత్వ కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగించే అవకాశం ఉన్నది. ఈమేరకు ప్రజల సమస్యల పరిష్కారం ‘ఆన్‌గోయింగ్‌’ పరిధిలోకి రావా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలెవరూ రాజకీయ పార్టీలకు చెందరని, ఓటు మాత్రమే వినియోగించుకుంటారని వారు గుర్తు చేస్తున్నారు. అలాంటి వారు ఎదుర్కునే సమస్యలు కనీసం చెప్పుకోవడానికైనా అధికారులు అనుమతించకపోతే ఎలా అని వారు అడుగుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రక్రియ మొదలయ్యే వచ్చే నెల 18 నుంచి ప్రజావాణిని నిలిపివేస్తే అర్థముండేదని వారు అంటున్నారు. అప్పటి నుంచి అధికారులందరూ ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉండడంతో ప్రజావాణిని నిర్వహించడం, ప్రజల సమస్యలు పరిష్కరించడం సాధ్యమయ్యే అవకాశం ఉండదు. కానీ నోటిఫికేషన్‌కు నెల రోజుల ముందు నుంచే ప్రజావాణిని నిలిపివేయడంతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొనే మంచినీరు, డ్రైనేజీ నిర్వహణలో ఇబ్బందులు, కరెంట్‌ సరఫరాలో లోపం, పంటలకు నీరందించడం, పింఛన్లు సక్రమంగా అందకపోవడం వంటి సమస్యలను గాలికి వదిలేయాల్సిందేనా అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- మరోవైపు, మెదక్‌ జిల్లాలో మాత్రం సోమవారం ప్రజావాణిని యథావిధిగా నిర్వహించడం విశేషం.

మెదక్‌ కలెక్టరేట్‌లో ప్రజావాణికి 73 ఆర్జీలు

మెదక్‌ అర్బన్‌, మార్చి 18: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి నేరుగా వచ్చి సమస్యలను చెప్పుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రమేష్‌ సూచించారు. సోమవారం మెదక్‌ పట్టణంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వచ్చి ప్రజల నుంచి ఆర్జీలను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి సమస్యలున్నా ఇతరులపై ఆధారపడకుండా నేరుగా ప్రజావాణికి వచ్చి చెప్పుకోవాలని సూచించారు. ప్రజావాణిలో ధరణిలో సమస్యలపై 33, పెన్షన్‌ కోసం 4, ఉపాధి, ఇతర సమస్యలపై 33 దరఖాస్తులు వచ్చాయని తెలియజేశారు. ఆయా ఆర్జీలను వెంటనే పరిష్కారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, జడ్పీ సీఈవో ఎల్లయ్య, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 11:36 PM