Share News

జల్లియంత్రాల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం

ABN , Publish Date - May 31 , 2024 | 12:12 AM

ప్రమాదాల బారినపడుతున్న రైతులు

జల్లియంత్రాల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం
పీఏసీఎస్‌ సొసైటీ భవనంలో జల్లియంత్రాలు

చేర్యాల, మే 30 : చేర్యాల, కొమురవెల్లి మండలకేంద్రాలలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జల్లి పట్టే యంత్రాల ఏర్పాటులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు ఇబ్బందులుపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించడంతో పాటు జల్లిపట్టే యంత్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నా, క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం అమలు చేపట్టడం లేదు.

మొరాయిస్తున్న యంత్రాలు

పలు కేంద్రాల్లో జల్లి యంత్రాలు సక్రమంగా పనిచేయడంలేదు. నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడంతో మొరాయిస్తున్నాయి. స్విచ్‌ ఆన్‌చేస్తే ప్రారంభం కాకపోవడంతో రైతులు చేయితో తిప్పుతూ, ఆన్‌ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కొమురవెల్లి మండలం గురువన్నపేటకు చెందిన బుడిగె మల్లేశం చేయితో తిప్పి స్టార్ట్‌ చేసేందుకు ప్రయత్నించగా, ప్రమాదవశాత్తు బెల్ట్‌లో చేతివేళ్లు పడి గాయపడ్డాడు. జల్లియంత్రాన్ని మార్చాలని, తనకు జరిగిన ప్రమాద విషయమై జిల్లా కలెక్టర్‌ కార్యాలయాధికారులకు విన్నవించినా ఎవరూ స్పందించకపోగా, ఇప్పటికీ జల్లియంత్రాన్ని బాగుచేయలేదని తెలిపారు. తాను చేతివేళ్లు కోల్పోవడానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇటీవల పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు.

చేర్యాలలో మూలుగుతున్న జల్లియంత్రాలు

చేర్యాల పట్టణంలో పీఏసీఎస్‌ సొసైటీ కార్యాలయ భవనం ఆవరణలో జల్లియంత్రాలు మూలనపడి మూలుగుతున్నా పట్టించుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఒక్కో యంత్రం ద్వారా రోజంతా ముగ్గురు కష్టపడాల్సి వస్తుండటంతో పాటు రోజుకు కొద్దిమంది ధాన్యం మాత్రమే జల్లిపట్టుకునే అవకాశం ఉంది. పైగా అవి మొరాయిస్తుండటంతో ప్రైవేటుయంత్రాలను గంటలకు రూ.800కు అద్దెకు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు జల్లియంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - May 31 , 2024 | 12:13 AM