Share News

కోడ్‌ కూసింది

ABN , Publish Date - Mar 17 , 2024 | 12:07 AM

లోక్‌సభ ఎన్నికలకు మోగిన నగారా

కోడ్‌ కూసింది

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రచారం బంద్‌

ఎంపీ అభ్యర్థి ప్రచార ఖర్చు పరిమితి రూ.95 లక్షలు

ప్రభుత్వ ప్రచార పోస్టర్లు, ఫ్లెక్సీల తొలగింపు ప్రకియ షురూ

మే 13 న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి/మెదక్‌, మార్చి 16 : పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ వచ్చేసింది. ఎన్నికల షెడ్యూలును శనివారం ప్రకటించగా తక్షణమే కోడ్‌ అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌కు ఏప్రిల్‌ 18న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్నది. ఆరోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్నది. ఏప్రిల్‌ 25న నామినేషన్ల స్వీకరణ ముగియనున్నది. 26న పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువుగా నిర్ణయించింది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నది.

ప్రచార పరిమితి రూ.95 లక్షలు

పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచార ఖర్చుగా రూ.95 లక్షలను ఎన్నికల సంఘం పరిమితి విధించింది. ఇందుకు సంబంఽధించి అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చులను ఎప్పటికప్పుడు ఎన్నికల పరిశీలకులు, వ్యయపరిశీలకులు పరిశీలించనున్నారు. వీరితో పాటు ఎన్నికల సంఘం నియమించిన ఫ్లయింగ్‌ స్క్వార్డ్స్‌, స్టాటిక్‌ సర్వేలెన్స్‌, వీడియో సర్వేలెన్స్‌ తదితర బృందాలు పరిశీలించనున్నాయి. అభ్యర్థుల ప్రచార ఖర్చును ఎన్నికల సంఘం నియమించిన వ్యయబృందాలతో ఆడిట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.

గుర్తింపు కార్డుతోనే ఓటు

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు 12 రకాల గుర్తింపు కార్డులను ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఇందులో ఏదో ఒక కార్డును చూపించి ఓటర్లు ఓటేయాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డుల్లో ఆధార్‌, ఉపాధిహామీ జాబ్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఫోటోతో ఉన్న పెన్షన్‌ కార్డు, బ్యాంకు, పోస్టాఫీసు పాస్‌బుక్‌ తదితర కార్డులను ఎన్నికల సంఘం అనుమతించింది.

జహీరాబాద్‌ ఆర్వోగా సంగారెడ్డి కలెక్టర్‌ క్రాంతి

జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారిగా సంగారెడ్డి కలెక్టర్‌ వల్లూరు క్రాంతి నియమితులయ్యారు. అడిషనల్‌ రిటర్నింగ్‌ అధికారులుగా సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్‌, ఆర్డీ మాధురిని ఎన్నికల సంఘం నియమించింది. ఈ పార్లమెంట్‌ పరిఽధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను కూడా ఎన్నికల సంఘం నియామకం చేసింది. జహీరాబాద్‌ సెగ్మెంట్‌కు సంగారెడ్డి రెవెన్యూ అధికారి జి.పద్మజారాణి, జూకల్‌కు కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి, బాన్స్‌వాడకు ఆర్డీవో రమేశ్‌రాథోడ్‌, ఎల్లారెడ్డికి ఆర్డీవో ఎం.ప్రభాకర్‌, కామారెడ్డికి ఆర్డీవో వై.రంగనాథ్‌రావు, నారాయణఖేడ్‌కు ఆర్డీవో అశోక్‌చక్రవర్తి, అందోలుకు ఆర్డీవో పాండు, జహీరాబాద్‌కు ఆర్డీవో రాజు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు.

మెదక్‌ ఆర్వోగా కలెక్టర్‌ రాహుల్‌

మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ వ్యవహరించనున్నారు. ఈ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఆర్డీవోలను అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులుగా నియమించారు. దుబ్బాక సెగ్మెంట్‌కు సిద్దిపేట అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, పటాన్‌చెరుకు సంగారెడ్డి జిల్లా మైనారిటీ అధికారి ఏఆర్వోగా వ్యవహరిస్తారు. మిగిలిన సెగ్మెంట్లకు ఆర్డీవోలు ఏఆర్వోలుగా పనిచేస్తారు.

జహీరాబాద్‌ ప్రధాన అభ్యర్థులు ఖరారు

జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియెజకవర్గం నుంచి పోటీ చేసే ప్రధాన అభ్యర్థులు ఇప్పటికే ఖరారు కాగా మెదక్‌లో మాత్రం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఇంకా ప్రకటించలేదు. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు బరిలో నిలిచారు. జహీరాబాద్‌లో బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ బీబీపాటిల్‌, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ సురేశ్‌షెట్కార్‌, బీఆర్‌ఎస్‌ నుంచి గాలి అనిల్‌కుమార్‌ పోటీపడుతున్నారు.

జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో 1,971 పోలింగ్‌ కేంద్రాలు

జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 1,971 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో సాధారణ పోలింగ్‌ కేంద్రాలు 1,600, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 371 ఉన్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పోలింగ్‌ కేంద్రాలు నారాయణఖేడ్‌లో 296, అందోలులో 313, జహీరాబాద్‌లో 313, జూకల్‌లో 255, ఎల్లారెడ్డిలో 270, కామారెడ్డిలో 266, బాన్స్‌వాడలో 258 ఉన్నాయి.

మెదక్‌ లోక్‌సభ పరిధిలో 2,098 పోలింగ్‌ కేంద్రాలు

మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 2,098 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెగ్మెంట్‌ల వారీగా సిద్దిపేటలో 273, మెదక్‌లో 274, నర్సాపూర్‌లో 305, సంగారెడ్డిలో 281, పటాన్‌చెరువులో 391, దుబ్బాకలో 253, గజ్వేల్‌లో 321 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఓటర్లు

మొత్తం ఓటర్లు 16,35,042

పురుషులు 7,98,888

మహిళలు 8,36,095

ఇతరులు 59

జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్లు

అసెంబ్లీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

నారాయణఖేడ్‌ 1,18,410 1,17,958 9 2,36,377

అందోలు 1,22,296 1,27,785 5 2,50,086

జహీరాబాద్‌ 1,37,054 1,37,140 2 2,74,196

జూకల్‌ 99,230 1,02,991 9 2,02,230

ఎల్లారెడ్డి 1,06,550 1,15,708 2 2,22,260

కామారెడ్డి 1,21,980 1,31,882 19 2,53,881

బాన్స్‌వాడ 93,368 1,02,631 13 1,96,012

మొత్తం 7,98,888 8,36,095 59 16,35,042

మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఓటర్లు

మొత్తం ఓటర్లు 18,12,858

పురుషులు 8,95,777

మహిళలు 9,16,876

ఇతరులు 205

మెదక్‌ లోక్‌సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్లు

అసెంబ్లీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

సిద్దిపేట 1,16,042 1,20,361 71 2,36,474

మెదక్‌ 1,03,654 1,13,089 5 2,16,748

నర్సాపూర్‌ 1,09,806 1,16,342 6 2,26,154

సంగారెడ్డి 1,22,021 1,25,284 33 2,47,338

పటాన్‌చెరువు 1,97,557 2,09,757 85 4,07,419

దుబ్బాక 96,867 1,02,369 0 1,99,236

గజ్వేల్‌ 1,37,630 1,41,854 5 2,79,489

మొత్తం 8,95,777 9,16,876 205 16,35,042

Updated Date - Mar 17 , 2024 | 12:07 AM