మానవసేవే.. మాధవ సేవ
ABN , Publish Date - May 30 , 2024 | 11:40 PM
దైవం కల్పించిన బంధాలను కాపాడుకోవాలి మోక్షజ్ఞానం ఇచ్చేది గురువే ఆధ్యాత్మిక చింతన అందరికీ అవసరం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
సదాశివపేట, మే 30: మానవసేవయే మాధవసేవ అని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో గురువారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అచల మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అచల గురు పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఆధ్యాత్మిక చింతన అందరికీ అవసరమన్నారు. మనిషికి బంఽధాలన్నీ భగవంతుడు కల్పిస్తాడని స్పీకర్ గర్తు చేశారు. గురువు ఇచ్చిన జ్ఞానం వల్లే మోక్షం లభిస్తుందన్నారు. సేవ గుణమే ఉత్తములుగా తీర్చిదిద్దుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సాటి మనిషిని ప్రేమించడం అలవర్చుకోవాలని కోరారు. ఆపదలో ఉన్న వారికి చేతనైన సాయం చేయాలని చెప్పారు. జన్మనిచ్చిన తల్లితండ్రులకు సేవ చేయాలని పేర్కొన్నారు. రక్తం పంచుకుని పుట్టిన అన్న-తమ్ముళ్లను, అక్కా-చెల్లెళ్లను ప్రేమించాలని సూచించారు. కుటుంబ సభ్యులను ప్రేమించలేని వారు ప్రపంచంలో ఎవరిని కూడా ప్రేమించలేరన్నారు. సాటి మనిషి పట్ల ప్రేమ, దయ, జాలి, కరుణ కలిగి ఉంటేనే జీవితానికి అర్థం ఉంటుందన్నారు. మనిషికి మనిషి అండగా ఉండడమే భగవంతుడికి అత్యంత ఇష్టమైన ఆరాధన అని వివరించారు. మనిషిగా పుట్టి బతికి ఉన్నంత కాలం మానవత్వాన్ని ప్రదర్శించడంలోనే దైవత్వం ఇమిడి ఉన్నదన్నారు. లోకకళ్యాణం కోసం జరిగే ప్రతి ఆఽధ్యాత్మిక కార్యక్రమానికి తోచిన సహాయం అందించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అచల గురు ఆశ్రమాలు సమాజంలో మనుషుల్లో మానవతా విలువలను నేర్పించి, దైవనామ స్మరణ అలవర్చి, మంచి మార్గంలో నడిచేలా అందిస్తున్న సేవా కార్యక్రమాలు గొప్పనైనవని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కొనియాడారు. ఆధ్యాతిక్మ సేవా కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే సదాశివపేట అచల గరుపీఠం బాధ్యులతో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి అచల గరు ఆశ్రమాల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూరుస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. సదాశివపేటకు చెందిన నిర్భయానంద చందంపేట బసవరాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అచల మహాసభలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.