Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

మమ్మేలు కొమురెల్లి మల్లన్నా

ABN , Publish Date - Mar 03 , 2024 | 11:35 PM

చేర్యాల, మార్చి 3: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో వారాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు.

మమ్మేలు కొమురెల్లి మల్లన్నా
రాజగోపుర ఆవరణలో భక్తుల సందడి

ఏడోవారం జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

పట్నాలు రచించి, బోనాల నివేదన

వీవీఐపీ, ఉచిత దర్శన క్యూలైన్లలో బారులు

చేర్యాల, మార్చి 3: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో వారాన్ని పురస్కరించుకుని ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. జయహో...కొమురవెల్లి మల్లన్నా... మమ్మేలు మాయన్నా.... జయహో... అంటూ జయజయధ్వానాలు చేసి భక్తులు భక్తితన్మయత్వం చెందారు. తలనీ లాలు సమర్పించి కోనేరులో పుణ్యస్నానమాచరించారు. బోనం నివేదించి బెల్లం పాయసం నైవేద్యం పెట్టి బసచేసిన ప్రదేశం, గంగిరేగుచెట్టు ప్రాంగణం, ముఖమండపాలలో చెలక, నజరు, ముఖ మండప పట్నాలు రచించారు. స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు, బండారి, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఎల్లమ్మతల్లికి కల్లు, బెల్లంపానకం శాకపెట్టి బోనం నివేదించారు. తమను చల్లగా కాపాడుమని వేడుకున్నారు. తమ కోరికలు ఈడేర్చమని వేడుకుంటూ గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో వీవీఐపీ, ప్రత్యేక ఉచిత దర్శన క్యూలైన్లలో బారులుతీరారు. స్వామివారి దర్శనానికి 3 గంటల పాటు సమయం పట్టడంతో ఇబ్బందులుపడ్డారు. ఈవో బాలాజీశర్మ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టగా, సీఐ శ్రీను, ఎస్‌ఐ నాగరాజు బందోబస్తు నిర్వహించారు. పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ పర్పాటకం లక్ష్మారెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా.. ఉదయం నుంచి విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన వెంటనే జనరేటర్‌ను ఆన్‌ చేయకపోవడంతో చీకట్లోనే భక్తులు దర్శనం చేసుకున్నారు.

మల్లన్న భక్తులకు అందుబాటులో అభిషేకం లడ్డూ

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ దర్శనార్థం వచ్చిన భక్తులకు అభిషేకం లడ్డూ ప్రసాదం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. రూ.900 చెల్లించి ఆర్జితసేవలు నిర్వహించిన వారితో పాటు రూ.500తో వీవీఐపీ దర్శన టికెట్‌ తీసుకున్న భక్తులకు ఆదివారం ఆలయవర్గాలు 400 గ్రాముల లడ్డూప్రసాదాన్ని అందించారు. 100 గ్రాముల పరిమాణం లడ్డూ ప్రసాదం కిలో తయారీకి రూ.38, 400 గ్రాముల పరిమాణంగల అభిషేకం లడ్డూ తయారీ కిలోకి ఒక పైసా చొప్పున లేబర్‌ చార్జీల చెల్లిస్తుండటంతో కాంట్రాక్టర్‌ అభిషేకం లడ్డూలకు బదులు 100గ్రాముల లడ్డూలు అందిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నా ఆలయవర్గాలు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై ఇటీవల ‘ఆంధ్రజ్యోతిలో’ మల్లన్న భక్తులకు అందని లభిషేకం లడ్డూ’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఆలయాధికారులు అభిషేకం లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయించారు. వీవీఐపీ దర్శనం, ఆర్జితసేవలు నిర్వహించిన భక్తులకు ఉచితంగా అందించడంతో పాటు ప్రసాద కౌంటర్లలో విక్రయానికి చర్యలు తీసుకున్నారు. లడ్డూ ప్రసాద తయారీ లేబర్‌ చార్జీల చెల్లింపుల్లో కొన్నినెలలుగా కొనసాగుతున్న అవకతవకలపైనా విచారణ చేపట్టాలని భక్తులు కోరారు.

Updated Date - Mar 03 , 2024 | 11:35 PM