Share News

ఎన్నాళ్లీ నిరీక్షణ!

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:12 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జహీరాబాద్‌ పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీ సమీపంలో 1982లో ఏర్పాటు చేసిన చిన్న, మధ్య తరహా పట్టణ సమగ్రాభివృద్ధి పథకం(ఐడీఎ్‌సఎంటీ) కాలనీలో ప్లాట్ల కేటాయింపు సమస్య దశాబ్దాల కాలంగా కొలిక్కిరావడం లేదు.

ఎన్నాళ్లీ నిరీక్షణ!

జహీరాబాద్‌లో దశాబ్దాలుగా కొలిక్కిరాని ఐడీఎ్‌సఎంటీ ప్లాట్ల సమస్య

రిజిస్ట్రేషన్లు పూర్తయినా ప్లాట్‌ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి

కాలనీలో ఇళ్లను నిర్మించుకున్న వారికి వసతులు కరువు

హమీలకే పరిమితమైన నేతలు, అధికారులు

జహీరాబాద్‌, జనవరి 4 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జహీరాబాద్‌ పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీ సమీపంలో 1982లో ఏర్పాటు చేసిన చిన్న, మధ్య తరహా పట్టణ సమగ్రాభివృద్ధి పథకం(ఐడీఎ్‌సఎంటీ) కాలనీలో ప్లాట్ల కేటాయింపు సమస్య దశాబ్దాల కాలంగా కొలిక్కిరావడం లేదు. ఐడీఎ్‌సఎంటీ అంటేనే అమ్మో అదో వివాద సమస్య అనే స్థాయికి కొందరు తెచ్చిపెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు, నాయకులు హామీలకే పరిమితమయ్యారు. లబ్ధిదారులు మాత్రం సమస్య పరిష్కారం కోసం ఏళ్లుగా నిరీక్షిస్తూనే ఉన్నారు.

101 ఎకరాల్లో 1,294 ప్లాట్లు

1982లో అప్పటి ప్రభుత్వం జహీరాబాద్‌ పట్టణంలోని హౌజింగ్‌బోర్డుకు ఆనుకుని ఉన్న 156, 157, 158, 160, 161 సర్వే నంబర్లలోని 101 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఐడీఎ్‌సఎంటీ ప్లాట్లను చేశారు. మొత్తం 1,294 ప్లాట్లకు 1,115 ప్లాట్లను రిజిస్ర్టేషన్‌లు చేసేందుకు సిద్ధం చేశారు. 1987లో పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. 2009 వరకు ఏటా కొన్ని చొప్పున నామినల్‌ ఫీజుతో మున్సిపాలిటీలో రిజిస్ర్టేషన్లు చేశారు. అయితే నిబంధనల ప్రకారం అధికారులు రిజిస్ర్టేషన్‌ చేయాల్సి ఉండగా నాయకులు రిజిస్ర్టేషన్‌లు చేశారు. అయితే అనర్హులకు కేటాయించారని, రిజిస్ర్టేషన్లను రద్దుచేయాలని 2009లో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2009 నుంచి 2013 వరకు ప్లాట్ల సమస్య న్యాయస్థానం పరిధిలో ఉండడంతో ఐడీఎ్‌సఎంటీ విషయంలో అధికారులు, నాయకులు పట్టించుకోలేదు. 2013లో నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన వాటిని రద్దుచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. దీంతోఅధికారులు అప్పట్లో బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో ప్రత్యేక సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. అప్పటి నుంచి ఈ వ్యవహారాన్ని ఎటూ తేల్చకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

300 మంది ఇళ్లను నిర్మించుకున్నారు

అప్పట్లో ఇందులో పేదలకు ఎల్‌ఐజీ, మధ్యతరహా వారికి ఎంఐజీ, ఉన్నతాదాయ వర్గాల వారికి హెచ్‌ఐజీ, వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్‌ అంటూ బ్లాక్‌లుగా విభజించి ప్లాట్ల కేటాయింపులకు శ్రీకారం చుట్టారు. ఇందులో హెచ్‌ఐజీలో 76 ప్లాట్లు, ఎంఐజీలో 264 ప్లాట్లు, ఎల్‌ఐజీలో 305, ఈడబ్ల్యూఎస్‌ మరికొన్ని ప్లాట్లను అప్పట్లో సిద్ధం చేశారు. ఈడబ్ల్యూఎస్‌ కింద 110 గజాలకు రూ.5వేలు, ఎల్‌ఐజీలో 260 గజాలకు 15వేలు, ఎంఐజీలో 300 గజాలకు రూ.16,500, హెచ్‌ఐజీలో 360 గజాలకు రూ.21,000 చొప్పున ఫీజులను నిర్ధారించి అప్పట్లో రిజిస్ట్రేషన్‌లను చేశారు. ప్రస్తుతం అందులో సుమారు 300 మంది లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకున్నారు. కాలనీలో వసతులు కల్పించాలని అధికారులకు, పాలకులను వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల ప్రకటనతో మ్యుటేషన్‌కు బ్రేక్‌

అయితే ఇళ్లను నిర్మించుకున్న వారు కాకుండా మరికొందరు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వారి వద్ద రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు మాత్రమే ఉన్నాయి కానీ ప్లాట్‌ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి నాన్చూతూ వస్తున్న ఐడీఎ్‌సఎంటీ ప్లాట్ల సమస్యను స్థానిక నాయకులు, లబ్ధిదారులు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌కు విన్నవించగా వారు స్పందించి వివాదస్పదంగా లేని వాటిని మ్యుటేషన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. వారి ఆదేశాలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో ప్రక్రియకు బ్రేక్‌ పడింది. మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్య తీరుతుందని ఆశించిన లబ్ధిదారులకు మరోమారు నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రె్‌స ప్రభుత్వమైనా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఉన్నతాధికారులకు నివేదించాం

ఐడీఎ్‌సఎంటీకి సంబంధించిన వివరాలన్నీ ఉన్నతాధికారులకు నివేదించాం. అనుమతులు వస్తే మ్యుటేషన్‌ ప్రారంభిస్తాం. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ చేపడుతాం.

- సుభా్‌షరావు, మున్సిపల్‌ కమిషనర్‌

Updated Date - Jan 05 , 2024 | 12:12 AM