Share News

స్థానికమా.. బల్దియా సమరమా?

ABN , Publish Date - May 26 , 2024 | 11:26 PM

మల్లన్నసాగర్‌ పునరావాస కాలనీ నాయకుల్లో అయోమయం రెవెన్యూ పరిధి.. బల్దియా కావడంతో విలీనానికే అవకాశం స్థానికంగా కొనసాగాలంటే గెజిట్‌ తప్పనిసరి! ఎటూ తేల్చుకోలేకపోతున్న నాయకులు, ప్రజలు

స్థానికమా.. బల్దియా సమరమా?
మల్లన్నసాగర్‌ భూనిర్వాసిత కాలనీ

గజ్వేల్‌, మే 26: మల్లన్నసాగర్‌ భూ నిర్వాసిత కాలనీకి చెందిన నాయకుల్లో అయోమయం నెలకొంది. తొగుట, కొండపాక మండలాల పరిధిలోని గ్రామాలను గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని గజ్వేల్‌, సంగాపూర్‌, ముట్రాజ్‌పల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో పునరావాస కాలనీని ఏర్పాటు చేసి, నివాసాలు నిర్మించి ఇచ్చారు. తొగుట మండలంలోని వేములఘాట్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌, బంజేరుపల్లి, పల్లెపహాడ్‌, రాంపూర్‌, లక్ష్మాపూర్‌ గ్రామ పంచాయతీలు, కొండపాక మండలంలోని ఎర్రవల్లి గ్రామ పంచాయతీతో పాటు తిప్పారం గ్రామ మధిర గ్రామమైన సింగారం గ్రామాలు కలిపి పునరావాస కాలనీలో ఉన్నాయి. ఈ క్రమంలో 2021లో కాలనీ ఏర్పడిన సమయంలో అక్కడ సర్పంచ్‌, ఎంపీటీసీలు, వివిధ పదవులకు ప్రజాప్రతినిధులుగా వ్యవహరించిన నాయకులు పదవీ కాలం అయిపోయే వరకు కొనసాగడంతో పాటు ఉపాధి హామీ మినహా మిగతా అన్ని కార్యకలాపాలు గ్రామపంచాయతీల ద్వారానే నిర్వహించారు. ఇప్పుడు కూడా గ్రామ కార్యదర్శులు, ప్రత్యేకాధికారుల సమక్షంలోనే పాలన సాగుతున్నది. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మల్లన్నసాగర్‌ భూనిర్వాసిత కాలనీలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తారా లేక మునిసిపాలిటీ రెవెన్యూ పరిధిలో కాలనీ ఉండడం మూలాన బల్దియాలో విలీనం చేస్తారా అన్న మీమాంస స్థానిక నాయకులు, ప్రజల్లో నెలకొంది.

మునిసిపాలిటీలో విలీనం చేస్తే పన్నులు పెరిగే అవకాశం

భూనిర్వాసిత కాలనీని గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీలో విలీనం చేస్తే ఉపాధి లేని నిర్వాసితులకు పన్నుల రూపంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పొరుగునే ఉన్న రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఎల్‌ఎండీలో భూములు కోల్పోయిన నిర్వాసిత గ్రామాలు వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పటికీ వాటిని గ్రామపంచాయతీలుగా కొనసాగిస్తూ వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధి సంస్థలో విలీనం చేశారు. అదే మాదిరిగా మల్లన్నసాగర్‌ భూనిర్వాసిత కాలనీని ప్రత్యేక మండలంగా చేయడంతో పాటు గ్రామపంచాయతీలుగా కొనసాగించాలని కోరుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మునిసిపాలిటీల్లో విలీనం చేయాలనుకుంటే ఆస్తి పన్ను మినహాయింపునకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతున్నారు. గ్రామపంచాయతీలుగా కొనసాగించాలని కోరుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్‌ మంత్రి దనసరి అనసూయ(సీతక్క)కు కాలనీవాసులు వినతిపత్రాలను కూడా అందజేశారు. కాగా ఇటీవలే కాలనీకి ప్రత్యేకంగా పోలీస్‌స్టేషన్‌ మంజూరైనట్లు సమాచారం.

ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్‌

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మల్లన్నసాగర్‌ భూనిర్వాసిత కాలనీపై ఏ నిర్ణయం తీసుకుంటుందోనని నాయకులు, ప్రజలు అయోమయంలో పడిపోయారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పదేళ్ల పాటు గ్రామపంచాయతీలుగా కొనసాగించడంతో పాటు ఉపాధి హామీ ఇతర పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో భూనిర్వాసిత కాలనీలో గ్రామపంచాయతీలను కొనసాగిస్తారా లేక మునిసిపాలిటీలో విలీనం చేస్తారా ప్రశ్న అందరిలో మెదులుతున్నది. ప్రత్యేక గ్రామపంచాయతీలుగా కొనసాగించాలంటే గజ్వేల్‌, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌ రెవెన్యూ గ్రామాల పరిధిలోని భూములను విభజించి, రెవెన్యూ వచ్చేలా చూడాలి. ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశం చేసి తీర్మానంతో పాటు గెజిట్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని స్థానికులు ఆందోళనలో మునిగిపోయారు.

Updated Date - May 26 , 2024 | 11:26 PM