Share News

కొమురెల్లి మల్లేశా..శరణు శరణు

ABN , Publish Date - Jan 23 , 2024 | 12:36 AM

‘‘శరణు.. శరణు.. కొమురెల్లి మల్లేశా..’’ అంటూ మల్లికార్జున స్వామిని స్తుతిస్తూ శివసత్తులు, పోతరాజులు, భక్తులు కణకణమని రగిలే నిప్పుల్లో చిందులేసి మైమరచి చిందులేశారు...

కొమురెల్లి మల్లేశా..శరణు శరణు
వీరకోలలతో శివసత్తుల వీరంగం

మల్లన్న క్షేత్రం బండారిమయం

ఘనంగా పట్నంవారం పెద్దపట్నం, అగ్నిగుండాలు

చేర్యాల, జనవరి 22 : ‘‘శరణు.. శరణు.. కొమురెల్లి మల్లేశా..’’ అంటూ మల్లికార్జున స్వామిని స్తుతిస్తూ శివసత్తులు, పోతరాజులు, భక్తులు కణకణమని రగిలే నిప్పుల్లో చిందులేసి మైమరచి చిందులేశారు... ‘‘దేవుడు.. మల్లన్న దేవుడు..మాదేవుడు.. సొరికెల్లో కొలువైనాడు.. మాదేవుడు...’’ అంటూ స్వామి నామస్మరణతో అశేష భక్తజనులు పులకించారు. దేవదేవుడి ఆవాహనంతో చేతిలో వీరకోలతో సిగమూగుతూ అగ్నిగుండాలు దాటి తన్మయత్వం చెందారు. భక్తిపారవశ్యంలో కొముర వెల్లి ఓలలాడింది.

కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభంలో భాగంగా పట్నంవారాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌కు చెందిన యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆలయతోటబావి ప్రాంగణంలో మల్లన్నకు అత్యంత వైభవోపేతంగా పెద్దపట్నం వేసి అగ్నిగుండాలు నిర్వహించారు. యాదవ పూజారులు పసుపు, కుంకుమ, పచ్చ, బియ్యంపిండి, సునేరు, పంచరంగులతో పెద్దపట్నాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వంటచెరుకుతో అగ్నిగుండాలను తయారుచేశారు.పెద్దపట్నానికి చిత్రకన్ను అమర్చి గుమ్మడికాయలను అష్టదిక్పాలకులకు అలంకరించారు. మల్లన్న చరిత్ర, మహిమలను వివరిస్తూ యాదవపూజారులు ఒగ్గుకథను ఆలపించగా భక్తులు జయజయధ్వానాలు చేయడంతో ఆలయపరిసరాలు ప్రతిధ్వనించాయి. భక్తిప్రపత్తులతో వేస్తున్న పట్నాన్ని తిలకిస్తూ అశేష భక్తజనం పులకించిపోయారు. భక్తులు మల్లన్నను స్మరిస్తూ బండారిని వంటినిండా ధరించడంతో ఆలయ పరి సరాలన్నీ పసుపుమయంగా మా రింది. పట్నం వేయడం, అగ్నిగుండాలను తయారు చేయడం పూర్తికాగానే గర్భాలయం నుంచి అర్చకులు మహదేవుని మల్లికార్జున్‌ తదితరులు ఉత్సవ విగ్రహాలను పోలీసు బందోబస్తు నడుమ తీసుకొచ్చి పట్నం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. యాదవులు గుమ్మడికాయలను బలిహరణ చేయగానే అర్చకులు అగ్నిగుండాలను దాటడం ప్రారంభించారు. అనంతరం మల్లన్నను స్మరిస్తూ అగ్నిగుండాలను దాటి స్వామివారిని దర్శించుకు న్న శివసత్తులు, భక్తులకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో బాలాజీశర్మ, పునరుద్ధరణ కమిటీ సభ్యులు తదితరులు కనుములు(ఆచారం) అందించి సత్కరించారు. పలువురు భక్తులు బెల్లంపానకం, నీళ్లప్యాకెట్లను, మరికొందరు అన్నదానం వితరణ చేశారు. బండారిని పంపిణీ చేశారు.

Updated Date - Jan 23 , 2024 | 12:36 AM