Share News

పరవశం

ABN , Publish Date - Mar 09 , 2024 | 11:47 PM

కొమురవెల్లిలో కన్నులపండుగగా పెద్దపట్నం

పరవశం
ఒగ్గు పూజారులు వేసిన పెద్దపట్నం

150 మంది ఒగ్గుపూజారులు, 41 వరుసలతో పట్నం

తిలకించి పులకించిన భక్తులు

మల్లన నామస్మరణతో మార్మోగిన తోటబావి ప్రాంగణం

కొమురవెల్లి, మార్చి 9 : కొమురవెల్లి మల్లికార్జునస్వామికి అత్యంత వైభవంగా పెద్దపట్నం వేశారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం తెల్లవారుజామున ఆలయ తోటబావి ప్రాంగణం వద్ద యాదవుల సంప్రదాయ ప్రకారం మల్లన్నకు ఘనంగా లగ్గం నిర్వహించారు. లింగోద్భవ సమయలో గర్భగుడిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పల్లకీసేవ నిర్వహించారు. ముందుగా ఒగ్గుపూజారులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆనవాయితీ ప్రకారం స్వామికి కోనేరులో తెప్ప స్నానం, సుంకుపట్టి, మైలపోలు కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం తోటబావి ప్రాంగణంలో స్వామివారి త్రిశూలం, ఢమరుకం ప్రతిష్టించారు. అనంతరం ఒగ్గు పూజారుల సంఘం సభ్యులు 150 మంది 41 వరుసలతో పసుపు, కుంకుమ, తెల్లపిండి, పచ్చ, సునేరుతో పెద్దపట్నాన్ని తీర్చిదిద్ది నిమ్మకాయతో చిత్ర కన్న నెలకొల్పారు. మరోవైపు మల్లన్న కథను ఒగ్గు కళాకారులు భక్తులకు ఆలకింపచేసారు. ప్రభుపూజారులు ఊరేగింపుగా పోతరాజుల వేషధారణ విన్యాసాలతో అలరించారు. ఒగ్గుపూజారులు మల్లన్నబోనాలను తీసుకొచ్చిన అనంతరం పట్నంపైపెట్టి స్వామికి నైవేద్యం సమర్పించారు. పట్నానికి నలువైపులా గుమ్మడికాయలు, నిమ్మకాయలతో బలిహరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్‌ ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారి ఉత్సవవిగ్రహాలను తీసుకువచ్చి, పట్నం చుట్టూ ప్రదక్షిణలు చేసి పట్నం తొక్కడం ప్రారంభించారు. పెద్దపట్నాన్ని తిలకించిన భక్తులు మల్లన్నను స్మరిస్తూ పట్నంపై నడిచి తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో తోటబావి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ పర్పాటక లక్ష్మారెడ్డి, ఈవో బాలాజీ శర్మ, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. మల్లన్న పట్నాన్ని తొక్కడానికి భక్తులకు అనుమతించిన సమయంలో కొందరు తొందరగా వెళ్లాలని పది అడుగుల ఎత్తు భారీకేడ్లపై నుంచి దూకారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిజెప్పి అదుపు చేశారు. పెదపట్నం ముగిసిన అనంతరం వీరశైవార్చకులు గర్భాలయంలో అన్నపూజ నిర్వహించారు.

కోనేటిలో మురుగు నీరు

అత్యంత విశిష్టమైన మహాశివరాత్రి సందర్భంగా శుక్ర, శనివారాల్లో వచ్చిన భక్తులు మురికి నీటిలోనే పుణ్య స్నానాలను ఆచరించారు. వేలాదిగా భక్తులు వచ్చి కోనేటిలో స్నానాలు చేస్తారని తెలిసి కూడా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు నీటిని శుభ్రపరచడంలో నిర్లక్ష్యం వహించారు.

Updated Date - Mar 09 , 2024 | 11:47 PM