Share News

మెతుకుసీమ రుణం తీర్చుకోలేను

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:05 AM

ఎన్ని జన్మలెత్తినా మెతుకుసీమ ప్రజల రుణం తీర్చుకోలేనని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ వద్ద మంగళవారం సాయంత్రం మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాదసభలో కేసీఆర్‌ ప్రసంగించారు.

మెతుకుసీమ రుణం తీర్చుకోలేను

ఏ జిల్లాలోనూ లేనంత ఎమ్మెల్యేలను గెలిపించారు

హరీశ్‌రావు కృషితోనే అది సాధ్యమయ్యింది

ఆగమాగం కాకుండా ఓటేయండి

ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఏప్రిల్‌ 16: ఎన్ని జన్మలెత్తినా మెతుకుసీమ ప్రజల రుణం తీర్చుకోలేనని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ వద్ద మంగళవారం సాయంత్రం మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాదసభలో కేసీఆర్‌ ప్రసంగించారు. మెతుకుసీమ ప్రజలే తనను ఈస్థాయికి తెచ్చారని.. వారి దీవెనతోనే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని పేర్కొన్నారు. ప్రజలిచ్చిన శక్తి వల్లే తనకు బలం చేకూరిందని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏ జిల్లాలో రానివిధంగా మెదక్‌ జిల్లాలో బీఆర్‌ఎ్‌సకు భారీ మెజార్టీ వచ్చిందని తెలిపారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పది స్థానాల్లో ఏడు స్థానాల్లో తమను గెలిపించారని, హరీశ్‌రావు కృషితోనే అది సాధ్యమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వెంకట్రాంరెడ్డి, అనిల్‌కుమార్‌ను ఆయన ప్రజలకు పరిచయం చేశారు. మెదక్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తున్న వెంకట్రాంరెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ప్రజల మన్ననలు చూరగొన్నారని పేర్కొన్నారు. ఆయనకు డబ్బు అవసరం లేదని అన్నారు. జహీరాబాద్‌ అభ్యర్థిగా ఉన్న గాలి అనిల్‌కుమార్‌ 2000 సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నారని చెప్పారు. బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి పేర్కొన్నారు. ఆగమాగం కాకుండా ఈ ఎన్నికల్లో వీరిద్దరినీ గెలిపించాలని కేసీఆర్‌ కోరారు.

బోనస్‌ ఇస్తావా? బొంద పెట్టమంటావా?

సంగారెడ్డి టౌన్‌ : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ప్రజా ఆశీర్వాదసభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తామని మాటిచ్చి.. తప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బొంద పెట్టే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ పాలనపై ప్రజలకు విసుగొచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మంచినీళ్లు, ఆసరా పెన్షన్‌ రావడం లేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ లేదని, రైతు భరోసా ఇవ్వడం లేదని, మహాలక్ష్మి కింద రూ.2,500 పింఛన్‌, నిరుద్యోగభృతి, కల్యాణలక్ష్మిలో రూ.లక్షతో పాటు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని మోసం చేయారని విమర్శించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజాపాలన అంటూ ఒక్కరోజు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండి తర్వాత పాలనను మర్చిపోయిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల వెంట బడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్‌ఎస్‌ గెలుపును ఆపలేరన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లలో ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ కానీ, నర్సింగ్‌ కాలేజ్‌ కానీ ఇవ్వలేదని ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్‌ గ్యాస్‌ ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందని మండిపడ్డారు. అనంతరం బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. రైతు భరోసా ఇవ్వడానికి పంట సాగు చేసిన తర్వాత ఇస్తామని ఓ మంత్రి అనడం రైతులను మోసగించడమేనని విమర్శించారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో 70 లక్షల మందికి రైతుబంధు ఇచ్చామని పోచారం శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌

పుల్‌కల్‌ : బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాదసభ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో జోష్‌ నింపింది. జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అందోలు, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ సెగ్మెంట్లు, మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని సంగారెడ్డి, నర్సాపూర్‌, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సభ 5.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా సభా స్థలం నిండలేదు. కేసీఆర్‌ వచ్చే సమయానికి జనంతో కిటకిటలాడింది. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌ వద్ద మాజీ సెం కారుపై అక్కడి నేతలు పూల వర్షం కురిపించారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన బయలుదేరిన కేసీఆర్‌ శామీర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్‌ ఎక్కి పటాన్‌చెరు వద్ద దిగారు. సంగారెడ్డి సమీపంలోని ఓ గార్డెన్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. రాత్రి 7.05కు కేసీఆర్‌ ప్రసంగాన్ని ప్రారంభించి 7.30కు ముగించారు. దాదాపు 25 నిమిషాల తన ప్రసంగంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను వంచించారని విమర్శించారు. అక్కరకు రాని చుట్టమని బీజేపీ తీరును ఎండగట్టారు. కేసీఆర్‌ ప్రసంగానికి ప్రజలు చప్పట్లతో మద్దతు తెలిపారు. సభలో మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, కళాకారుడు సందీప్‌ నిర్వహించిన ధూంధాం ఆకట్టుకుంది. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ పాటల రూపంలో కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టారు. జహీరాబాద్‌, మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థులు గాలి అనిల్‌కుమార్‌, బి.వెంకట్రాంరెడ్డి, జడ్పీ చైర్మన్లు పట్లోళ్ల మంజుశ్రీజైపాల్‌రెడ్డి, హేమలతశేఖర్‌గౌడ్‌, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, మాణిక్‌రావు, సునీతారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్‌, భూపాల్‌రెడ్డి, పద్మారెడ్డి, సత్యనారాయణ, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, మాజీ జడ్పీ చైర్మన్‌ బాలయ్య, నాయకులు పట్లోళ్ల జైపాల్‌రెడ్డి, మఠం భిక్షపతి, ఎర్రోల్ల శ్రీనివాస్‌, పల్లె సంజీవయ్య, ప్రతా్‌పరెడ్డి, నరోత్తం, దేవీప్రసాద్‌, బుచ్చిరెడ్డి, రాజేందర్‌ముదిరాజ్‌, విజయ్‌కుమార్‌, శివకుమార్‌, దర్శన్‌రెడ్డి, మాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:05 AM