Share News

తడి, పొడి చెత్తతో ఆదాయం

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:22 PM

సిద్దిపేటరూరల్‌, ఫిబ్రవరి 29: సిద్దిపేట రూరల్‌ మండలంలోని గ్రామాలు స్వచ్ఛతకు ఆదర్శంగా నిలిచాయని జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి అభినందించారు.

తడి, పొడి చెత్తతో ఆదాయం
పొడి చెత్త కట్టింగ్‌ మిసన్‌ను ప్రారంభిస్తున్న అధికారులు, నాయకులు

సాహస్‌ స్వచ్ఛంద సంస్థ పనితీరు భేష్‌

రూరల్‌ మండలంలోని గ్రామాలు స్వచ్ఛతకు నిదర్శనం

జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి

సిద్దిపేటరూరల్‌, ఫిబ్రవరి 29: సిద్దిపేట రూరల్‌ మండలంలోని గ్రామాలు స్వచ్ఛతకు ఆదర్శంగా నిలిచాయని జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి అభినందించారు. సాహస్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంవత్సర కాలంగా తడి, పొడి చెత్త వేరుచేసి ఇచ్చే పద్ధతిపై సంస్థ కల్పించిన అవగాహన విధానం బేష్‌ అంటూ కితాబిచ్చారు. తడి చెత్త భూమిలో త్వరగా కలిసిపోవడంతో పాటు పంటకు అవసరమైన ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు. కానీ పొడి చెత్త భూమిలో కరిగిపోకపోవడంతో పాటు దుష్ప్రభావాలను కలిగిస్తున్నదని చెప్పారు. అందుకే సాహస్‌ స్వచ్ఛంద సంస్థ పొడి చెత్తను వేరు చేసి ఇచ్చే విధానంపై చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సీజీఐ పరిశ్రమ వైస్‌ ప్రెసిడెంట్‌ జ్యోతి శైలేంద్ర మాట్లాడుతూ తడి, పొడి చెత్తవేరు చేసి వినియోగించడంపై, నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం, థర్డ్‌ జెండర్స్‌ అభివృద్ధి కోసం, సాగునీటి కాలువల అభివృద్ధి కోసం సీజీఐ పరిశ్రమ పనిచేస్తున్నదన్నారు. సాహస్‌ స్వచ్ఛంద సంస్థకు నిధులు అందిస్తూ తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నదని పేర్కొన్నారు. సుడా మాజీ చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇర్కోడ్‌ గ్రామాల్లో తడి, పొడి చెత్త వేరుచేసి ఇవ్వడం వల్ల వర్మీ కంపోస్ట్‌ ఎరువులు ఉత్పత్తి చేయడం, విక్రయించడం వల్ల రైతులకు నాణ్యమైన ఎరువులు అందుతున్నాయని, గ్రామపంచాయతీకి ఆదాయం సమకూరుతున్నదని చెప్పారు. భవిష్యత్తులో పొడి చెత్తపై ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఇర్కోడ్‌ గ్రామంలోని డంపింగ్‌యార్డులో పొడి చెత్తను వేరుచేసి ముక్కలుగా చేసే మిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి హరిప్రసాద్‌, ఎంపీటీసీ బాబు, సాహస్‌ స్వచ్ఛంద సంస్థ మేనేజర్‌ శేఖర్‌, కోఆర్డినేటర్‌ ఇటిక్యాల చిన్న, సూపర్‌వైజర్లు, వాలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:22 PM