అధికారుల చేతుల్లో..
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:32 AM
గ్రామాలు, మండలాల పరిపాలన వ్యవహారాలన్నీ అధికారుల చేతుల్లోకి వచ్చాయి. ఆర్నెళ్ల క్రితం గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు పూర్తికావడంతో మండలస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు.

ఇప్పటికే గ్రామాలు.. ఇకపైన మండలాలు
ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు
ఎన్నికలు పూర్తయ్యేదాకా వీరిదే ఆధిపత్యం
ప్రత్యేక దృష్టిసారిస్తేనే ప్రయోజనం
గ్రామాల్లో స్పెషలాఫీసర్లపై విమర్శల వెల్లువ
ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, జూలై4: గ్రామాలు, మండలాల పరిపాలన వ్యవహారాలన్నీ అధికారుల చేతుల్లోకి వచ్చాయి. ఆర్నెళ్ల క్రితం గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు పూర్తికావడంతో మండలస్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. తాజాగా స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో జిల్లా స్థాయి అధికారులకు మండలాల బాధ్యత అప్పగించారు. అయితే గ్రామాలను పర్యవేక్షిస్తున్న అధికారులపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. మండల ప్రత్యేకాధికారులైనా బాధ్యతగా వ్యవహరించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గడిచిన ఐదేళ్లలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా కీలకమయ్యారు. నిన్నటి తో వారి పదవీకాలం ముగిసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామపంచాయతీలతోపాటు స్థానిక సంస్థలు సైతం అధికారుల పాలనల్లోకి వెళ్లాయి. సంగారెడ్డి జిల్లాలోని 647 గ్రామపంచాయతీలు, 28 మండలాలు, సిద్దిపేట జిల్లాలోని 499 గ్రామపంచాయతీలు, 26 మండలాలు, మెదక్ జిల్లాలోని 467 గ్రామపంచాయతీలు, 20 మండలాల పరిపాలన కార్యకలాపాలన్నీ ఇక నుంచి అధికారులే పర్యవేక్షించనున్నారు.
బాధ్యతలను భారంగా..
ప్రస్తుతం మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. అయితే ఆర్నెళ్ల క్రితమే గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారుల్లో కొందరు తమ బాధ్యతలను భారంగా మోస్తున్నారు. అదనపు బాధ్యతలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు లేకపోవడంతో ఆ బాధ్యతలను ప్రత్యేకాధికారులే నిర్వర్తించాల్సి ఉంది. కానీ కొందరు అధికారులు తమదైన ముద్రవేస్తుండగా చాలామంది గ్రామాల పరిపాలనతోపాటు అభివృద్ధి, సంక్షేమాలను విస్మరిస్తున్నారు. కనీస వసతులను కల్పించడంలో విఫలమవుతూ స్థానికంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. చుట్టపుచూపుగా గ్రామాలను సందర్శిస్తూ సంతకాలకు పరిమితమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తమ మాతృశాఖల్లో ఉన్న పనులతోనే సమయం గడిచిపోతుందని, దీనికితోడు గ్రామాల బాధ్యతలను పర్యవేక్షించడం భారంగా మారిందనే నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నియామకమైన మండల ప్రత్యేకాధికారులతో కొత్తదనం చేకూరుతుందనే అంచనాలున్నాయి. మండల ఇన్‌చార్జులంతా జిల్లా స్థాయి అధికారులే కావడంతో గ్రామాల స్పెషలాఫీసర్లను గాడిన పెట్టే అవకాశాలు లేకపోలేదు.
మరో ఆర్నెళ్లు అధికారులేనా..!
ఫిబ్రవరిలో గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు ముగియగా అప్పటి నుంచి ప్రత్యేకాధికారులే కొనసాగుతున్నారు. వాస్తవానికి గత జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. కానీ రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో అసమానతలు ఉన్నందున ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నారు. కులాల గణన తర్వాతనే ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలను సైతం జూన్‌లో నిర్వహించాల్సి ఉండగా రిజర్వేషన్ల సమస్య ఉండడంతో ఇవి కూడా వాయిదా పడ్డాయి. అందుకే మండలాలకూ ప్రత్యేకాధికారులను నియమించారు. మరికొద్ది రోజుల్లో కులాల గణన చేపట్టినా అది ముగియాలంటే కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని అంచనా. ఈ లెక్కన ఎన్నికలు పూర్తయ్యి కొత్త ప్రజాప్రతినిధులు అడుగుపెట్టాలంటే మరో ఆర్నెళ్లు ఆగాల్సిందేనన్న చర్చ జరుగుతోంది.