Share News

అసైన్డ్‌ భూముల్లో జోరుగా అక్రమ కట్టడాలు

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:35 PM

కొల్చారం, ఏప్రిల్‌ 14: నిరుపేదలకు ప్రభుత్వం జీవనోపాధి నిమిత్తం పంపిణీ చేసిన ప్రభుత్వ (అసైన్డ్‌) భూముల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

అసైన్డ్‌ భూముల్లో జోరుగా అక్రమ కట్టడాలు
దుంపలకుంట చౌరస్తాలో ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న వ్యాపార సముదాయం

నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్న అధికారులు

యథేచ్ఛగా కొనసాగుతున్న నిర్మాణాలు

కొల్చారం, ఏప్రిల్‌ 14: నిరుపేదలకు ప్రభుత్వం జీవనోపాధి నిమిత్తం పంపిణీ చేసిన ప్రభుత్వ (అసైన్డ్‌) భూముల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన తహసీల్దార్‌ పట్టించుకోవడం లేదు. దీంతో కొల్చారం మండలంలోని దుంపలకుంట చౌరస్తాలో అసైన్డ్‌ భూముల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అప్పట్లో పలు ఫిర్యాదులు రావడంతో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ నోటీసులు ఇచ్చారు. అయినా నిర్మాణాలు ఆగడం లేదు. గతంలో నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు జీవో 58,59 కింద అవకాశం ఇచ్చినా ప్రభుత్వానికి ఎవరూ బకాయిలు చెల్లించకుండా ఎగనామం పెడుతున్నారు. ఎనగండ్ల గ్రామపంచాయతీలోని దుంపలకుంట చౌరస్తా మెదక్‌- జోగిపేట ప్రధాన రహదారిపై ఉన్నది. ఈ ప్రాంతం కొల్చారం, కౌడిపల్లి, చిల్‌పచెడ్‌ మండలాల సరిహద్దుగా ఉండడంతో ఇక్కడి స్థలాలకు రెక్కలు వచ్చాయి. కాగా దుంపలకుంట చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపులా సర్వే నెంబరు 330లో మొత్తం 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇక్కడి స్థలాలకు డిమాండ్‌ ఉండడంతో ప్రభుత్వ భూమికి కూడా గుంటకు రూ.10 నుంచి 15 లక్షల వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వ భూమి అని తెలిసినా కొంతమంది కొనుగోలు చేసి గ్రామపంచాయతీ నుంచి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. పంచాయతీ కార్యదర్శి అందినకాడికి దండుకుని అక్రమ నిర్మాణానికి ఇంటి నెంబర్‌ ఇస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అసైన్డ్‌ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో పంచాయతీ కార్యదర్శి ఇప్పటికీ రెండుసార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వ అసైన్డ్‌ భూముల్లో తాము నోటీసులు మాత్రమే ఇస్తామని, తదుపరి చర్యలు తహసీల్దార్‌ తీసుకుంటారని కార్యదర్శి శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Apr 14 , 2024 | 11:35 PM