Share News

వక్ఫ్‌ భూమిలో అక్రమ నిర్మాణాలు

ABN , Publish Date - May 14 , 2024 | 11:36 PM

రాత్రికి రాత్రే బోరు తవ్వకాలు నోటీసులతో సరిపెడుతున్న మున్సిపల్‌ అధికారులు

వక్ఫ్‌ భూమిలో అక్రమ నిర్మాణాలు
సంగారెడ్డిలోని వక్ఫ్‌భూమిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలు

సంగారెడ్డిటౌన్‌, మే 14: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో సర్కారు, వక్ఫ్‌ బోర్డు భూములకు రక్షణ లేకుండా పోయింది. వీటిలో పాగా వేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా ఆ భూముల్లో రాత్రికిరాత్రే బోర్లు వేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన ఆయా శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలోని ఐబీ వెనుకాల జిల్లా అధికారులు నివాసం ఉంటున్న ఇళ్లకు కూతవేటు దూరంలో వక్ఫ్‌ బోర్డుకు చెందిన భూమి ఉన్నది. అందులో కొంతమంది రియల్టర్లు యథేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. మున్సిపల్‌ అధికారులు కేవలం నోటీసులతోనే సరిపెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మించిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కూడా పట్టించుకోవడంలేదనే విమర్శలొస్తున్నాయి.

తప్పుడు పత్రాలు సృష్టించి

సంగారెడ్డి పట్టణంలోని ఐబీ వెనుక జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు నివాసం ఉంటున్న భవనాల సమీపంలో వక్ఫ్‌బోర్డ్‌కు చెందిన దాదాపు ఐదు ఎకరాల ఖాళీ స్థలం ఉన్నది. 374 సర్వేనంబరులో కొంత భూమిని గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం వక్ఫ్‌బోర్డుకు కేటాయించినట్టు తెలిసింది. ఈ భూమిలో కొంతమంది వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నెల రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం అంతా లోక్‌సభ ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడాన్ని గమనించిన కొందరు అక్రమార్కులు వక్ఫ్‌ బోర్డు భూమిపై కన్నేశారు. ఇదే అదనుగా భావించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు.

అనుమతి లేకుండా బోరు

వక్ఫ్‌బోర్డు భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో పాటు రాత్రికి రాత్రే బోర్లు వేశారు. ఈ బోర్లకు వాల్టా చట్టం నిబంధనల ప్రకారం రెవెన్యూ, భూగర్భ జల శాఖల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. రాజకీయ పలుకుబడి కలిగిన కొంతమంది ఈ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండానే రాత్రి వేళల్లో బోర్లు వేశారు. ఈ విషయంపై స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు.

పట్టించుకోని టాస్క్‌పోర్స్‌

అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను అరికట్టేందుకు 2019లో రెవెన్యూ, పోలీస్‌, ఇరిగేషన్‌, మున్సిపల్‌ శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ టీంను ప్రభుత్వం నియమించింది. సంగారెడ్డిలోని వక్ఫ్‌ బోర్డుకు కేటాయించిన 374 సర్వేనంబరులో భూమిలో అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని నెల రోజుల క్రితం మున్సిపల్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను తక్షణమే తొలగించాలని టాస్క్‌ఫోర్స్‌ బృందానికి లేఖ రాసినట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను నియంత్రించడంలో టాస్క్‌ఫోర్స్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. అక్రమ నిర్మాణాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం ఉండడంతోనే అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వక్ఫ్‌బోర్డు భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - May 14 , 2024 | 11:36 PM